వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, నైరుతి రాజస్థాన్, దాని సమీప ప్రాంతాల్లో పశ్చిమ డిస్ట్రబెన్స్ పాక్షికంగా చురుకుగా ఉంటుంది. దీనితో పాటు, దక్షిణ కొంకణ్ మరియు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ద్రోణి అంటే అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా, మార్చి 6 నుండి 8 వరకు మధ్య భారతదేశంలో తేలికపాటి, మోస్తరు మరియు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 6 నుంచి 9 వరకు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మార్చి 6 నుంచి 7 వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఇక నుంచి అధిక ఉష్ణోగ్రతల విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వస్తోంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం-ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ బులెటిన్‌లో తెలిపారు.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీలో వడగళ్ల వాన
మంగళవారం (మార్చి 7) ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్రల్లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే 5 రోజుల్లో దేశంలోని వాతావరణంలో గణనీయమైన తేడాలు ఉండవు. మధ్య భారతం, మహారాష్ట్ర, గుజరాత్ మినహా దేశం మొత్తం మీద గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో, మార్చి 8 బుధవారం కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అంచనా. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది.