అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు. ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన సమయం వచ్చింది. తనకు తగినట్లుగానే మంచి సంబంధం తీసుకొచ్చాడు. తనకు ఉన్నంతలో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. బంధువులందరిని పిలిచాడు. వచ్చిన బంధువులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. కూతురుని మెట్టినింటికి పంపించేందుకు ఇంక కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. 


అంత సంతోషాన్ని చూసి దేవుడికి కన్నుకుట్టిందో ఏమో? అంత మంది ఆనందంగా ఉండడం నచ్చలేదో ఏమో? సంతోషంగా గడపాల్సిన ఇంట్లో విషాదం నింపాడు. భజంత్రీలు మోగాల్సిన ఇంటిలో చావు డప్పు మోగేలా చేశాడు. కూతురి పెళ్లి చూడకుండానే ఆ ఇంటి పెద్దను తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన గ్రామంలో ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టించింది. హృదయాన్ని తలచివేసే ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలాపూర్‌లో జరిగింది.


కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాలాపూర్‌ గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. అంబాలాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రల రాములు-మంజుల దంపతులు.  మండల కేంద్రంలో రాములు ట్రాక్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాములు మంజుల దంపతులకు ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. 


పెద్ద కూతురు లావణ్య వివాహం ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్తగట్టు శ్రీమత్స్య గిరీంద్రస్వామి గుట్టపై జరగాల్సి ఉంది. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు అందరూ వచ్చారు. పెళ్లి మండపం చుట్టాలు, బంధువులతో సందడిగా ఉంది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. అతిథులు, ఆహ్వానితులకు వడ్డించేందుకు వంట కూడా పూర్తయింది. మరో రెండు గంటల్లో పెళ్లి తంతు పూర్తవుతుందనగా అనుకోని ఆపద వచ్చింది. పెళ్లి కూతురు తండ్రి ఎర్రల రాములు గుండెలో నొప్పితో కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే రాములు మృతి చెందినట్లు తెలిపారు. 


మరో రెండు గంటల్లో కూతురు పెళ్లి చేయాల్సిన తండ్రి గుండెపోటుతో మృతి చెందడంతో పెళ్లి ఆగిపోయింది. సంతోషంతో కళకళలాడాల్సిన పెళ్లింట రోధనలు మిన్నంటాయి. రాములు మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భార్య ముగ్గురు కుమార్తెల రోధనలు పలువురిని కంటతడి పెట్టించాయి. కూతురు పెళ్లి చూడకుండానే కన్నుమూశావా రాములా అంటూ బంధువుల రోదనలతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.


గత మార్చిలో ఖమ్మం జిల్లాలోనే ఇలాంటి ఘటనే
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో గత మార్చి నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. కూసుమంచి చెందిన అర్జున్ వీఆర్వోగా పని చేసేవారు. అర్జున్ కుమార్తెకు వివాహం మార్చి 18 శనివారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. అర్జున్ పెళ్లి హడావుడిలో ఉండగానే శుక్రవారం తెల్లవారు జామున గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ని గమనించి ఆసుపత్రికి తరలించేలోపే అర్జున్ మృతి చెందాడు. దాంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 


అమ్మాయి పెళ్లి కావడంతో తండ్రి అర్జున్ ఇంట్లో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశాడు. దాంతో ఇళ్లంతా సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఇంటికి రావడంతో ఇల్లంతా కోలాహలంగా మారింది. వారందరినీ చూస్తూ సంతోషంగా ఉన్న అర్జున్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ఇల్లు.. ఆర్తనాదాలతో నిండిపోయింది. ఇల్లంతా విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఆ గ్రామంలోనూ అదే పరిస్థితి నెలకొంది.