తెలంగాణ సీఎం కేసీఆర్ టూర్ కు ముందే జగిత్యాలలో అపశృతి చోటుచేసుకుంది. కేసీఆర్ జగిత్యాల పర్యటనలో భాగంగా బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పరుశురాం సీఎం పర్యటనలో భాగంగా డ్యూటీకి వచ్చాడు. కానీ అస్వస్థతకు గురై ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి పడిపోయారు. ఇది గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కానిస్టేబుల్ పరశురాం మృతి చెందాడు. కానిస్టేబుల్ పరుశురాం వయసు 57 ఏళ్లు. ఆయన స్వగ్రామం ఉట్నూరు మండలం ఓదెలు గ్రామం అని సమాచారం. 


ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం వడోనికి పరుశురాం భౌతికకాయం చేరుకుంది. కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పరుశురాంకు భార్య ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె) ఉన్నారు. ఇంద్రవెల్లిలో 100 డయల్ వాహనంలో ఎక్కువగా విధులు నిర్వహించే పరుశురాం తన విధులను రాత్రిపూట సక్రమంగా నిర్వహించేవారు. స్ట్రింగ్ ఆపరేషన్ లలోను గంజాయి తదితర స్పెషల్ డ్రైవ్ లలో చురుకుగా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు, పరశురాం మృతి పట్ల పట్ల జిల్లా ఎస్పి ఉదయ్ రెడ్డి, ఉట్నూర్ ఎఏస్పి హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, ఉట్నూర్ సిఐ సైదారావ్, ఇంద్రవెల్లి ఎస్సై సునిల్, పోలిస్ సిబ్బంది దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.


రెండు వారాల కిందట ఏపీలోనూ ఇలాంటి విషాదమే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ నవంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు. ఈ క్రమంలో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ కుప్పకూలి మృతి చెందాడు. సీఎం పర్యటన సందర్భంగా పరిసర జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులకు నరసన్నపేటలో డ్యూటీ వేశారు. అనకాపల్లి ట్రాఫిక్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న అప్పారావును సైతం నరసన్నపేటలో డ్యూటీ వేయగా.. విధుల్లో ఉన్న అప్పారావు తీవ్ర అస్వస్థతకులోనై మృతి చెందాడు. 




KCR to visit Jagtial on December 7: జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు అయింది. రేపు అంటే డిసెంబర్ 7వ తేదీన సీఎం కేసీఆర్ జగిత్యాల్ కు రాబోతున్నారు. ఉదయం 11 గటలకు హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకునే అవకాశం ఉంది. మొదట జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మొదట 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా రోడ్డు మార్గాన బహిరంగ సభకు చేరుకోనున్నారు. అనంతరం మోతే రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 


అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు..
బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ,కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి, వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు రానున్నారు. ఈ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు పయనం కాబోతున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షిస్తున్నారు. జగిత్యాల, ధర్మపురి కోర్టులతో పాటు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి నియోజకవర్గల నుండి జనాల్ని సమీకరిస్తున్నారు. సుమారు ఐదు జిల్లాల నుండి 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో 2,325 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎడుగురు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ముగ్గురు మహిళా సీఐలు, 165  ఎస్ఐలు, 13 మంది మహిళా ఎస్సైలు ఉండనున్నారు.