Siddipet District News: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హందిపూర్ లో రెండు పడక గదుల ఇళ్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్న శిలసారం రమేష్ మృతదేహానికి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందర్ రావు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలతోపాటు ఇతర బీజేపీ నేతలు కూడా ఉన్నారు. కేసీఆర్ వెలుగబెడుతున్న ఇలాకాలో నిత్యం ఆత్మహత్యలు జరుగుతున్నాయనీ.. దళితులు, పేద వర్గాలు సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ప్రాణాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. రమేష్ మృతదేహానికి టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ యే బాధ్యత వహించాలన్నారు. ఇలా జరిగిన ఆత్మహత్యలు కప్పిపుచ్చడానికి పోలీసులను ప్రయోగిస్తున్నారని... బాధితులని భయపెడుతున్నారని అన్నారు. మనిషికి వెలగట్టి డెడ్ బాడీలను పోలీసు పహారా జేసీబీలు పెట్టీ మరీ పూడ్చిపెడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ లో చేరితేనే అన్ని పథకాలు..
నిన్న చనిపోయిన రమేష్, ఆంజనేయులువి ఆత్మహత్యలు కావని.. ప్రభుత్వ హత్యలే అని తెలిపారు. ఏ ఆఫీసుకు వెళ్లినా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. దీంతో పనులు కావాలంటే టీఆరెఎస్లో చేరాలని పోలీసులే చెప్పే నీచ స్థితికి యంత్రాంగం చేరుకుందన్నారు. ఇక పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, రావాలంటే తమ పార్టీలో ఉండాల్సిందే అని మంత్రులే స్వయంగా చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అబ్బ జాగీరు కాదని... సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఫాంహౌస్ భూములు, సొంత ఆస్తులు అమ్మడం లేదని.. ప్రజల సొమ్ము అమ్మి, వారికి పంచడానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని.. పేదలకు కన్నీళ్లు, శవాలు మాత్రమే మిగులుతున్నాయని అన్నారు. రమేష్, ఆంజనేయులు ఆత్మహత్యలు ప్రభుత్వ దుర్మార్గానికి, వైఫల్యానికి నిదర్శనం అని చెప్పారు.
మృతుల కుటుంబాలకు 50 లక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి..
వీరిద్దరి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రతి కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని సూచించారు. అలాగే ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఎక్కడో ఉన్న పంజాబ్, హరియాణా వెళ్లి చెక్కులు ఇస్తున్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను అప్పుల కుప్పలా మార్చింది సీఎం కేసీఆర్ యే అని ఈటల రాజేందర్ వివరించారు. తెలంగాణలో జరుగుతున్న మొత్తం తెలంగాణ ఆత్మహత్యల మీద విచారణ జరగాలన్నారు. అలాగే ప్రశ్నిస్తున్న తమ నోళ్లను మూయించే ప్రయత్నం చేయకుండా ఆత్మహత్యలు ఆగేలా చర్యలు తీసుకోవాలన సూచించారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఓట్లతో మీకు బుద్ధి చెప్తారని అన్నారు.