తెలంగాణలో వరుస ఐటీ, ఈడీ దాడులు ప్రకంపనలు రేపుతోన్నాయి. వరుస ఐటీ, ఈడీ సోదాలతో రాజకీయ దుమారం రేగుతోంది. గత నెలలో హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డి ఇళ్లతోపాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది.


మల్లారెడ్డి తర్వాత వంశీరామ్ బిల్డర్స్


తాజాగా ఇవాళ వంశీరామ్‌ బిల్డర్స్‌కు సంబంధించిన ఆఫీసులు, డైరెక్టర్ల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 
హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఐటీ అధికారులు దాడులు చేపడుతున్నారు. ఈరోజు తెల్లవారుజామునే వచ్చిన ఐటీ అధికారులు హైదరాబాద్‌, విజయవాడ నగరంలోని పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 36 చోట్ల తనిఖీలు చచేస్తున్నారు. వంశీరామ్‌ బిల్డర్స్‌ చైర్మన్‌ తిక్కవరపు సుబ్బారెడ్డితోపాటు డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.


ఈ సోదాల్లో భాగంగానే విజయవాడలో కూడా ఇద్దరు రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు తెల్లవారుజామున ఒకేసారి దాడులు ప్రారంభించారు. విజయవాడలో ఉంటున్న గన్నవం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంతోపాటుగా గుణదలలోని దేవినేని అవినాష్ ఇంట్లోకి ఐటీ అధికారులు ఒకే టైంలో ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తి గత సిబ్బందితోపాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. ఇంటికి సంబంధించిన డోర్స్‌ను క్లోజ్ చేశారు. ఇంట్లో ఉన్న వ్యక్తులను బయటకు వెళ్లనీయలేదు. బయట నుంచి ఇతరులను ఎవ్వరిని లోపలకు అనుమతించలేదు. ఇంటిలో ఉన్న మహిళలకు మహిళా పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు,వారి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. 


అవినాష్‌, వంశీ అనుచురులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆశ్చర్చానికి గురయ్యారు. ఎటువంటి సమాచారం బయటకు రాకుండా అధికారులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇన్నోవా వాహనాల్లో ఎవరూ మేల్కోక ముందే వారి ఇళ్లకు చేరుకున్నారు. 


హైదరాబాద్‌కు చెందిన వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయంతోపాటుగా ఇళ్ళలో కూడ ఐటీ అధికారులు దాడులు చేశారు. వంశీ రామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఆయన బావమర్ది జనార్దన్ రెడ్డి ఇంటిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడలోని ఈ ఇద్దరు నేతల ఇళ్ళపై కూడా తనిఖీలు చేస్తున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో అవినాష్‌కు ఉండే ఓ ల్యాండ్ విషయంలో ఈ తనిఖీలు సాగుతున్నట్టు సమాచారం.


రాజకీయకక్షలంటూ ఆరోపణలు


రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ సోదాలు అనేక అనుమానాలకు తావిస్తోన్నాయి. రాజకీయ కక్షలో భాగంగా టీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. బీజేపీ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తమను కావాలని ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. ఇదిలా ఉండగా రాజకీయ నేతల్లో భయం పుటిస్తుందన్న టాక్ నడుస్తోంది.