హైదరాబాద్‌లో ఐటీ శాఖ దాడులతో బెజవాడ ఉలిక్కి పడింది. ఇద్దరు ప్రముఖుల ఇళ్ళపై ఐటీ దాడులు జరుగటం సంచలనంగా మారింది. ఇద్దరు వైసీపీ నాయకులు కావటం ఇక్కడ మరో ట్విస్ట్. ఒకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాగా మరొకరు విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. హైదరాబాద్ వేదికగా బిజినెస్ రన్ చేస్తున్న వంశీ రామ్ బిల్డర్స్‌పై ఐటీ దాడులు చేపట్టింది. దాని ఎఫెక్ట్‌తో ఇటు అవినాశ్, వంశీ ఇళ్లపై కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు తెల్లవారు జామున ఒకేసారి దాడులు ప్రారంభించారు. విజయవాడలో ఉంటున్న గన్నవం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంతోపాటుగా గుణదలలోని దేవినేని అవినాష్ ఇంట్లోకి ఐటీ అధికారులు ఒకే టైంలో ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తి గత సిబ్బందితోపాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. ఇంటికి సంబంధించిన డోర్స్‌ను క్లోజ్ చేశారు. ఇంట్లో ఉన్న వ్యక్తులను బయటకు వెళ్లనీయలేదు. బయట నుంచి ఇతరులను ఎవ్వరిని లోపలకు అనుమతించలేదు. ఇంటిలో ఉన్న మహిళలకు మహిళా పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు,వారి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు.
అవినాష్, వంశీ అనుచురులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆశ్చర్చానికి గురయ్యారు. ఎటువంటి సమాచారం బయటకు రాకుండా అధికారులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇన్నోవా వాహనాల్లో ఎవరూ మేల్కోక ముందే వారి ఇళ్లకు చేరుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయంతోపాటుగా ఇళ్ళలో కూడ ఐటీ అధికారులు దాడులు చేశారు. వంశీ రామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఆయన బావమర్ది జనార్దన్ రెడ్డి ఇంటిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడలోని ఈ ఇద్దరు నేతల ఇళ్ళపై కూడా తనిఖీలు చేస్తున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో అవినాష్‌కు ఉండే ఓ ల్యాండ్ విషయంలో ఈ తనిఖీలు సాగుతున్నట్టు సమాచారం.
అధికార పార్టీకి చెందిన నేతలపై దాడులు..
ఏపీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇద్దరు కీలక నేతలు. ఒకప్పుడు ఈ ఇద్దరు టీడీపీలో కొనసాగినప్పటికి 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఇద్దరు నాయకులు వైసీపీలో చేరారు. సాంకేతిక కారణాల కారణంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటకు నుంచి వైసీపీ మద్దతు ఇస్తున్నారు. ఇక అవినాష్ అయితే నేరుగా పార్టీ కండువా కప్పుకొని జగన్‌కు దగ్గరయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలపైనే ఇప్పుడు ఐటీ దాడులు జరగటం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతలు తరచూ హైదరాబాద్‌కు వెళుతుంటారు. అక్కడే వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఇరువురు నాయకులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎక్కువగా ఆధారపడిన వారే. గతంలో హైదరాబాద్ భూముల ఆక్రమణలు, కబ్జాలు వంటి ఘటనలు వెలుగులోకి వచ్చిప్పుడు వంశీ, అవినాష్‌కు చెందిన అనుచరుల పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఐటీ అధికారులు కూడా దాడులకు పాల్పడటంతో రాజకీయంగా ఈ వ్యవహరం మరింత వివాదాానికి కారణం అయ్యే అవకాశం ఉంది.