తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ సమయం దగ్గరికి వచ్చింది. తెలంగాణ మహిళలకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ కి సిద్ధం అవుతోంది. ఈసారి 240 ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. 30 రంగుల్లో 800 కలర్ కాంబినేషన్లలో బ‌తుక‌మ్మ చీరలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కోట్ల మీటర్లు అవసరమని అంచనా వేయగా, పోయిన సంవత్సరం ఆలస్యంగా ఉత్పత్తి చేసిన చీరలను 1.23 కోట్ల మీటర్లు అప్పుడే స్వీకరించారు. 


3. 25 కోట్ల మీటర్లు సేకరణ పూర్తి
ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు 4.70 కోట్లు, గర్షకుర్తి, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కు కలిపి కోటి మీటర్లు కేటాయించారు. టెస్కో మంగళవారం నాటికి 3. 25 కోట్ల మీటర్లు సేకరించింది. ఇంకా రెండు 2.45 కోట్ల మీటర్లు రావాల్సి ఉంది. చేనేత, జౌళిశాఖ ఉత్పత్తులు ఈ నెల 20 లోపు పూర్తిచేసి అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అవసరమైన చీరలో సింహభాగం జిల్లాలోని మరమగ్గాలపై ఉత్పత్తి చేయనున్నారు. దీనికోసం డాబీ, జకార్డ్ అమర్చిన పదివేల మరమగ్గాలను ఎంపిక చేశారు. టెక్స్ టైల్ పార్కులో ఐదు రకాల డిజైన్లతో 30 లక్షల మీటర్ల జాకెట్ వస్త్రాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. దీనిలో 30 లక్షల మీటర్లు మాత్రమే పూర్తయింది. జాప్యం కారణంగా మిగతావి సిరిసిల్లలోనే ఉత్పత్తి చేస్తున్నారు. చీర అంచుల్లో రంగు రంగుల నూలుతో తయారు చేసిన ఆకర్షణీయమైన డిజైన్లు వస్తున్నాయి.


జనవరిలోనే ఆర్డర్లు..
ప్రభుత్వం నుంచి జనవరి నెలలోనే చీరల ఆర్డర్లు కేటాయించారు. మూడేళ్లుగా మీటర్ వస్ర్తానికి 32 రూపాయలు ఉంది. పెరిగిన ధరలతో గిట్టుబాటు కాదని పరిశ్రమలు ముందుకు రాలేదు. రాష్ట్ర ఉన్నత అధికారులతో పరిశ్రమ వర్గాలు చాలాసార్లు చర్చలు జరిపారు. చివరికి మీటరుకు 34.50 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మార్చి ఆర్డర్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఉత్పత్తి చివరి దశలో ఉంది.
బతుకమ్మ చీరల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 240 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. పెంచిన ధరల ఉత్తర్వులు అందాల్సి ఉంది. దాని ప్రకారం యూనిట్ల పరిధిలోని యజమానులు తాము ఉత్పత్తి చేసిన వస్త్రానికి బిల్లులు సమర్పించే అవకాశం ఉంది. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో జిల్లాలోని ఐదు వేల మంది కార్మికులు ఆరు నెలలుగా శ్రమిస్తున్నారు. వీరితో పాటు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది వరకు కార్మికులు వచ్చారు. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో పనిచేసిన ఒక్కో కార్మికుడికి రోజుకు తొమ్మిది వందల రూపాయల వరకు కూలి గిట్టుబాటు అవుతుంది. జిల్లా వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి అయిన చీర కోటి మీటర్ల పైనే ఉంది. 
వర్షాల కారణంగా, వినాయక నిమజ్జనం రావడంతో కొంత ఆలస్యం ఏర్పడింది. జాకెట్ వస్త్రం కొరకు ప్రత్యామ్నాయంగా సిరిసిల్ల లో ఉత్పత్తి చేస్తున్నారని, అవసరమైతే వైట్ రోటోగ్రే  వస్త్రాన్ని కూడా సేకరించాలని నిర్ణయించారు. వస్త్రం పంపిణీలో ఎలాంటి కొరత లేకుండా  చూస్తున్నామని చేనేత జౌళిశాఖ అధికారి సాగర్ తెలిపారు.