గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు మొత్తం పాడైపోయాయి. రెండు నెలల కిందట పడిన వానలతో దెబ్బతిన్న మార్గాలు ఇప్పుడు మరింత అధ్వాన్నస్థితికి చేరాయి. ఆయా గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లుపై లోతైనా గుంతలు పడ్డాయి. ఈ దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణమంటేనే ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. 


గతంలో పడిన కుండపోత వర్షాలకు కలిగిన నష్టాన్ని ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ అధికారులు ప్రాథమికంగా లెక్కలు కట్టారు. మరమ్మతులకు దాదాపు రూ. 150 కోట్ల వరకు అవసరమని గుర్తించారు. పై అధికారులకు నివేదికలు కూడా పంపించారు. ఇటీవలే కురిసిన వర్షాలకు కొత్తగా దెబ్బతిన్న వాటి పరిస్థితి గురించి వాకాబు చేసింది ప్రభుత్వం. పై స్థాయి అధికారుల ఆదేశాలతో  ప్రణాళికలు రూపొందించనున్నారు. దీంతోపాటు నీటిపారుదల శాఖ పర్యవేక్షణలో కాలువలు, చెరువులు, తూములు, గండి పడే ప్రమాదం ఉన్న వాటి వివరాల్ని సేకరిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో తిరుగుతున్న సిబ్బంది ఊర్ల వారీగా వివరాలు సేకరించే పనిలో మునిగిపోయారు. 


కరీంనగర్‌ కేంద్రం నుంచి నారాయణపూర్ వెళ్లే మార్గం ఈ ఏడాదిలో మూడు సార్లు తెగిపోయింది. చెరువు కింద వరద నీటి ఉద్ధృతిని తట్టుకోలేక ఇలా వేసిన ప్రతిసారి కొట్టుకుపోతుంది. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తెచ్చిన పైపులు, మట్టి, కంకర వేస్ట్ అయ్యాయి. ప్రవాహ వేగానికి తగినట్లుగా ఇక్కడ నిర్మాణం ఉండకపోవడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. పైగా నారాయణపూర్ గ్రామానికి దారులు ఇలా తెగిపోవడంతో రోడ్డుకు అవతలి వైపు ఆయా ఊరి ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 


వరుసగా రెండు మూడు రోజుల్లో జిల్లాలోని పదికిపైగా గ్రామాల్లో ఇలాంటి సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో వంతెనల నిర్మాణం దిశగా చర్యలు చేపట్టకపోతే ఇలాంటి ఇబ్బందులే ప్రతి వర్షాకాలంలో ఎదురవుతాయి. జిల్లాలో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. పోయిన సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే దాదాపు 20 శాతం ఎక్కువగా వానలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 


జిల్లా సగటు వర్షపాతం 650 మిల్లీమీటర్లు కాగా , ఇప్పటి వరకు ఏకంగా 1224 మిల్లీమీటర్ల మీద పడింది. అత్యధికంగా రామడుగు మండలంలో 1604 మిల్లీమీటర్లు ఉండగా, గంగాధర మండలంలో 1519 మిల్లీమీటర్లలో వర్షాలు కురిశాయి. రామడుగు మండలంలో ఉండాల్సిన దానికన్నా 149 శాతం వర్షం ఎక్కువగా పడింది. చొప్పదండి మండలంలో 36శాతం, చిగురుమామిడి మండలంలో 132 శాతం, గంగాధర మండలంలో 122 శాతం ఎక్కువగా వానలు పడ్డాయి. సైదాపూర్ సమీపంలోని ప్రధాన రహదారిపై లోతట్టు వంతెనకు దగ్గరగా ఉన్న రోడ్డుపై కల్వర్టు గత చిన్నాభిన్నమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ గుంతలతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ మండల పరిధిలో వర్షం అధికంగా కురిసింది. రహదారులు ధ్వంసమయ్యాయి.   ఇటీవల కురిసిన వర్షాలకు భారీ గుంతలతో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ మండల పరిధిలో వర్షం అధికంగా కురిసింది రహదారులు ధ్వంసమయ్యాయి. కల్వర్టులు చాలాచోట్ల పాడయ్యాయి.