గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాంటి సంస్థ నేడు లాభాల బాటలో పయనిస్తోంది. సరైన ప్లానింగ్, ప్రయాణికుల డిమాండ్ మేరకు సౌకర్యాల కల్పన వల్ల కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ రీజియన్లో 11 డిపోల్లో 862 బస్సులు ఉన్నాయి. 524 ఆర్టీసీ బస్సులు, 338 అద్దె బస్సులు ఉన్నాయి. 3,696 మంది ఉద్యోగులు ఆర్టీసీ సేవలను అందిస్తున్నారు.
అధికారులు ట్రాన్స్‌ఫర్
కరీంనగర్ రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్ర సర్వీసులను కూడా నడుపుతోంది ఆర్టీసీ సంస్థ. టీఎస్ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంస్కరణలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎమ్ మరియు డీఎంలు, ఇతర విభాగాల అధికారులను ట్రాన్స్‌ఫర్ చేశారు. డీవీఎం పోస్టులను డిప్యూటీ ఆర్ఎం గా మార్చారు. సంస్కరణల్లో భాగంగా రౌండప్ ఛార్జీలు, డీజిల్ సేవ, టోల్ ట్యాక్స్ లాంటి పలు రకాలైన ఛార్జీల్లో మార్పులు చేశారు. సిబ్బందికి కూడా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఐ-టిమ్ములను ప్రారంభించారు.
జులైలో నష్టాలు.. ఆగస్టులో లాభాల బాట
కరీంనగర్ రీజియన్లో ఆరు డిపోలు లాభాల బాట పట్టాయి. ఆగస్ట్ నెలలో వచ్చిన ఆదాయం మేరకు కరీంనగర్-1 డిపో, వేములవాడ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, గోదావరిఖని, మెట్ పల్లి, డిపోలో లాభాలు పొందగా, మిగిలిన జిల్లాలు నష్టాన్ని తగ్గించుకున్నాయి. ఇందులో 13.59 లక్షల కిలోమీటర్ల వరకు బస్సు సర్వీసులు 81.88 లక్షల లాభాలు పొంది కరీంనగర్-1 డిపో మొదటిస్థానంలో నిలిచింది. 15.5 లక్షల కిలోమీటర్లు బస్సు సర్వీసులు నడిపి 2 .16 లక్షల ఆదాయం తో గోదావరిఖని డిపో ఆరవ స్థానంలో నిలిచింది. జూలైలో 32.2 లక్షల నష్టాల్లో ఉన్న కరీంనగర్ -1 డిపో అధిగమించి 82 లక్షల లాభాన్ని పొందడం విశేషం. జూలైలో వర్షాలు పడటం చాలా ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అనుకున్న విధంగా ఆదాయం రాలేకపోయింది.
డిపోల వారీగా ఆదాయం చూస్తే కరీంనగర్-1 డిపో జులై నెలలో 2.89 లక్షల నష్టంతో ఉండగా, ఆగస్టు నెలలో 82 లక్షల లాభాన్ని పొందింది. వేములవాడ 55. 27 లక్షల నష్టంతో ఉండగా, ఆగస్టు నెలలో 55 లక్షల లాభం ఆర్జించింది. జగిత్యాల జిల్లా 32.03 లక్షల నష్టంతో ఉండగా,ఆగస్టు లో 54 లక్షల లాభం పొందింది. రాజన్న సిరిసిల్ల 33.41 లక్షల నష్టంతో ఉండగా, 30 లక్షల లాభం పొందింది. మెట్ పెల్లి 24.50 లక్షల నష్టంతో ఉండగా, ఆగస్ట్ లో 0.5 లక్షల లాభం పొందింది.
గోదావరిఖని 67.50 లక్షల నష్టంతో ఉండగా, 2 లక్షల మేర లాభాలొచ్చాయి. జులై నెలలో రీజియన్ మొత్తంమీద రూ.6.7 కోట్ల నష్టాలు చవిచూడగా, ఆగస్టులో అనూహ్యంగా లాభాల బాటపట్టింది. ఆగస్టులో ఆ నష్టాన్ని రూ.1.4 కోట్ల కు తగ్గించారు. ఆరు డిపోలు లాభాల్లో ఉండగా, మిగిలిన ఐదు డిపోలు కూడా తన నష్టాన్ని తగ్గించుకోగలిగాయి. రీజియన్ లో లాభాల్లోకి రావడంతో ఇటీవల కరీంనగర్లోని వెంకటేశ్వర్లు డీఎం లతో సమావేశం నిర్వహించి వారిని అభినందించారు.