Sircilla Rajeshwari passed away: చెదిరినా నా జీవితాన్ని చిత్రంల మార్చేశావు..
దీపం ఉంది కానీ.. వెలుగు లేదు..
మనసు ఉంది కానీ.. బాధతో నిండిపోయింది..
మనిషి ఉంది కానీ.. నిర్జివంగా ఉండిపోయింది.." అంటూ కవితలు రాసి ఎన్నో మనసులు గెలిచిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేదు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి వైద్య చికిత్స పొందుతుంది. ఈక్రమంలోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచింది. తన ఆత్మవిశ్వాసంతో, మనోసంకల్పంతో విధిని ఎదురించి బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చి తన కాళ్లతో తిరిగి రాసుకున్న సిరిసిల్ల రాజేశ్వరి మరణవార్త విని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దివ్యాంగురాలు, మాటలు రావు.. చేతులు లేవు.. నడవలేని పరిస్థితి.. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి.. అయితేనేం ధృడసంకల్పం ఉంది. కాళ్లనే చేతులుగా మార్చుకుంది. తన తల రాతను తానే తిరిగి రాసుకుంది. ఎన్నో హృద్యమైన కవితలు లిఖించి.. ఎందరో ప్రముఖులను కదిలించింది సిరిసిల్ల రాజేశ్వరి. సుమారు 500లకు పైగా కవితలు రాసింది రాజేశ్వరి.
తన కవిత్వాలతో.. తనకెంతో ఇష్టమైన రచయిత సుద్దాల అశోక్ తేజ మనసును కదిలించింది రాజేశ్వరి. ఆయనే స్వయంగా రాశేశ్వరి ఇంటికొచ్చి గుండెకు హత్తుకుని ఆశీర్వదించారు. అంతేకాకుండా.. రాజేశ్వరి రాసిన కవితలన్నింటినీ కలిపి.. కాళ్లతో కవితలు అనే పుస్తకాన్ని ప్రచురించి ఆమె ప్రతిభను విశ్వవ్యాప్తం చేశారు. రాజేశ్వరి పరిస్థితి తెలిసి.. తెలంగాణ సర్కారు.. రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. నెలనెలా రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నారు. రాజేశ్వరికి ఒక డబుల్ బెడ్ రూం ఇళ్లును కూడా కేటాయించారు.
“కలలు కనేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి.. కలల తీరం చేరాలంటే నిప్పుల బాటలో నడవాలి మరి.. అక్షరం పక్కన అక్షరం చేర్చి నడిచాను.. గమ్యం చేరేసరికి అది మధుర కావ్యమై నన్ను చేరుకుంది..!”
“కన్నీళ్లను కలం చేసి మనసును అక్షరాలుగా మలిచి బాధను భావంగా తలచి రాస్తున్నాను.. ఈ కావ్యాన్ని కవిత కోసం నేను పుట్టాను.. కాంతికోసం కలం పట్టాను.. వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం..!”
“నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన నాలోని సాహిత్యకళ ఆగదు.. వెలుగుతున్న చంద్రునికి కళ్లు లేవు, అయినా వెలుగుతూనే ఉంటాడు.. పారే జలపాతానికి కాళ్లు లేవు, అయినా జలజల పారుతూనే ఉంటుంది.. నాకు చేతులు లేవు, అయినా కానీ నాలో కవిత సాగుతూనే ఉంటుంది..!” అంటూ సిరిసిల్ల రాజేశ్వరి కవితా ఝరి సాగింది.
సిరిసిల్ల రాజేశ్వరి మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కేటీఆర్ అన్నారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి, ఆశయానికి కాదని, రాజేశ్వరి తన మనోత్సైర్యంతో నిరూపించిందన్నారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమైన కేటీఆర్, రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సిరిసిల్ల రాజేశ్వరి గురించి.....
సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు."సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు ఆరాటం ఎంత.రాజేశ్వరి రాసిన కవిత ను గమనిస్తేఆమె అక్షరాల పదును అర్థమవుతుంది. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవిత సంకనానికి జీవితమే కవిత్వం అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే కానీ అమే
మాత్రం జీవిస్తుంది అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి బుధవారం (28_ 12 _2022న) శాశ్వతంగా నిష్క్రమించారు. సిరిసిల్ల ప్రాంతం నుంచి వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు. రాజేశ్వరికి వినమ్రంగా కన్నీటి నివాళులు.