Karimnagar News: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని సీపీ సత్యనారాయణ తెలిపారు. పోలీసులకు సవాలు విసిరేల దొంగతనాల సంఖ్య పెరిగిందన్నారు. దొంగిలించిన సొమ్ము రికవరీ విషయంలో పోలీసులు నిదానంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆన్లైన్ మోసాల సంఖ్య ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చారు. సైబర్ నేరాల బారిన పడిన వారి సంఖ్య గతంతో పోలిస్తే పెరిగిందన్నారు. హత్యలు రెండింతలు అవగా... ఆత్మహత్యలు కూడా గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కమిషనరేట్ సేవలు మెరుగై రాష్ట్ర స్థాయిలో గుర్తింపు అందుకున్నప్పటికీ... వివిధ రకాల నేరాలు జరిగే విషయంలో మాత్రం జిల్లాలో మాత్రం తేడా కనిపించడం లేదన్నారు. మంగళవారం పోలీస్ కమిషనర్ ఇంట్లో నేరాల వార్షిక నివేదిక 2022ను సీపీ సత్యనారాయణ విడుదల చేశారు. ఆయనతో పాటు అదనపు డీసీపీ చంద్రమోహన్ కూడా ఉన్నారు. 


వివిధ రకాల సేవలు అందించడంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి, గంగాధర పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలోనే కేటగిరీలో-1 మొదటి, ద్వితీయ స్థానాలలో నిలిచాయని సీపీ సత్యనారాయణ తెలిపారు.సీసీ కెమెరాల సహాయంతో కేసులను త్వరగా ఛేదిస్తున్నామన్నారు. కమిషనరేట్ వివిధ రకాల విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కేటగిరి-2లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సంపాదించిందని వివరించారు. షీ టీంకు కౌన్సిలింగ్ విభాగంలో రాష్ట్రంలో కరీంనగర్ రెండో స్థానంలో నిలిచిందన్నారు. గడిచిన రెండు సంవత్సరాల తో పోలిస్తే వివిధ రకాల కేసుల్లో దొంగలు ఎత్తుకెళ్లిన సొమ్ము రికవరీ విషయంలో కమిషనర్ ఆఫ్ పోలీసులు వెనుకడుగు వేశారని వివరించారు. ఏడాదిలో ఇప్పటి వరకు 46 శాతం మాత్రమే సొమ్మును రికవరీని చేయగలిగారన్నారు. 2021లో 42.9 49 శాతం పురోగతి కనిపించగా ఈసారి మాత్రం రూ. 1.81 కోట్లు మాయం అయ్యాయని... అందులో కేవలం రూ.84.63 మాత్రమే తిరిగి స్వాధీన పరచుకోగలిగామన్నారు. ఇక నమోదైన కేసుల విషయానికి వస్తే 374 ఎఫ్ఐఆర్లు వివిధ రకాల కేసులకు నమోదు చేయగా ఈసారి ఆ సంఖ్య 3603కు తగ్గిందన్నారు.


గతేడాదిలో 538 రోడ్డు ప్రమాదాలు జరిగి 196 మంది చనిపోగా.. ఈ ఏడాది 553  ప్రమాదాలు జరిగి 183 మంది ప్రాణాలు కోల్పోయారని సీపీ వివరించారు. ప్రమాదాల నివారణ విషయంలో అనుకున్న మార్పు కనిపించలేదని చెప్పారు. సైబర్ నేరాల కలవరం జిల్లాలో ఈసారి ఎక్కువగానే కనిపించిందన్నారు. లోన్ యాప్స్ వల్ల చాలా బాధలు అనుభవించారని స్పష్టం చేశారు. 34 కేసులు ఆన్ లైన్ లో వివిధ రకాల మోసాల విషయంలో పోలీసులు కేసులు నమోదు చేయగా ఈసారి ఆ సంఖ్య 86కు పెరిగిందన్నారు. ఉద్యోగ మోసాలతోపాటు ఓటీపీతో నగదు స్వాహా నకిలీ ప్రొఫైల్ కేసులు ఉన్నాయన్నారు. ఆత్మహత్యలు కూడా చాలానే నమోదు అయ్యాయని పేర్కొన్నారు. 2018లో 229 మంది బలవన్మరణం చెందగా.. ఈసారి ఆ సంఖ్య 300కు చేరడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఈ ఆత్మహత్యల్లో పురుషులు 233 మంది కాగా.. 63 మంది స్త్రీలు ఉన్నారన్నారు. బాలికలు నలుగురు ఉన్నారని చెప్పారు.


చైన్ స్నాచర్లు వారి చేతివాటాన్ని ఈసారి బాగానే చూపించారని సీపీ తెలిపారు. పోయిన సంవత్సరం ఎనిమిది చోట్ల మహిళల నుంచి బంగారు ఆభరణాలను ముసుగు వేసుకొని వచ్చిన వారు దొంగిలించగా ఈసారి ఆ సంఖ్య 12 కు పెరిగిందన్నారు. ఈ దొంగల్ని పట్టుకునే విషయంలో పోలీసులు బాగానే పని చేశారని కొన్ని కేసుల్లో చోరీ చేసిన వారిని పట్టుకోగలిగారని వివరించారు. చోరీకి గురైన వాహనాల పట్టివేతలో మన పోలీసులు అనుకున్న విధంగా జోరును చూపించలేకపోయారన్నారు. ఈ ఏడాదిలో 42 చోట్ల వెహికిల్స్ మాయమావగా అందులో 32 పట్టుకున్నామన్నారు. గతేడాది 49 కి గాను 41 వాహనాలను తిరిగి పట్టుకొని వాహనదారులకు అప్పగించారని వివరించారు.