Sachin Tendulkar Art: భారత్ లో క్రికెట్ అనేది మతం అయితే దానికి సచిన్ టెండూల్కర్ దేవుడు. కోట్లాది మందికి ఆయనపై ఉన్న అభిమానం అలాంటిది మరి. తన ఆటతీరుకు, వివాదరహితమైన ప్రవర్తనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆయన అంటే విపరీతమైన అభిమానం ఉన్న సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్.. సచిన్ పుట్టిన రోజు సందర్భంగా పట్టువస్త్రంపై ఆయన చిత్రాన్ని రూపొందించి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. 


47 ఇంచుల వెడల్పు, 60 ఇంచుల పొడవుతో వెండి, పట్టు దారాలతో..!


సిరిసిల్ల చేనేత కళకారుడు వెల్ది హరిప్రసాద్ తన కళా రూపాలతో మరో ఘనత సాధించాడు. భారత మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ జన్మదినం సందర్భంగా సచిన్ దంపతుల ఫోటోను మగ్గంపై నేసి సచిన్ మిత్రుడు భారత మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్ కు బహుకరించారు. ఈ కళా రూపాన్ని సచిన్ కు చాముండేశ్వరి నాథ్ అందజేయనున్నారు. దీనిని తయారు చేయడానికి 20 రోజుల సమయం పట్టింది. ఇది 47 ఇంచుల వెడల్పు 60 ఇంచుల పొడవు ఉండి, వెండి పట్టు దారాలతో నేశారు. దీని బరువు 290 గ్రాములు ఇందులో 170 గ్రాముల వెండి పోగులు పట్టు దారంతో తయారు చేశారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు తాను వీరాభిమాని అని వెల్ది హరిప్రసాద్ తెలిపారు.


భద్రాద్రి సీతారాముల కోసం వెండి పీతాంబరం 


నేతన్న హరిప్రసాద్ చేనేత మగ్గంపై 20 రోజులపాటు శ్రమించి వెండి పట్టు పోగులతో పీతాంబరం నేశాడు.  750 గ్రాముల బరువున్న ఈ పీతాంబరం చీరను 150 గ్రాముల వెండి పోగులు, పట్టుదారంతో రూపొందించాడు. ఇరవై రోజుల పాటు నిద్రాహారాలు మాని నేసిన ఈ చీరను భద్రాద్రి సీతమ్మవారికి ప్రభుత్వం తరపున సమర్పించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. హరిప్రసాద్‌ వినతిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు ఈ మేరకు హరిప్రసాద్‌ తాను స్వయంగా నేసిన చీరను అధికారులకు అప్పగించాడు.   




గతంలోనూ జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్న హరిప్రసాద్



సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ గతంలోనూ ఇలాంటి పలు కళాఖండాలను రూపొందించారు. తన ప్రతిభతో పలుమార్లు జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడు. గతంలో 95వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరిప్రసాద్ పేరును ప్రస్తావించారు. సిరిసిల్ల పేరు ప్రఖ్యాతలు, సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ ప్రతిభను ప్రధాని మోదీ ప్రశంసించారు. చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపించిన నరేంద్ర మోడీ సిరిసిల్ల నేత కళాకారులు హరిప్రసాద్ ప్రతిభను తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ... తెలంగాణ పేరును గుర్తు చేశారు. వెల్ది హరిప్రసాద్‌ తనకు పంపించిన అద్భుత బహుమతిని చూసి ఆశ్చర్యపోయానని ప్రధాని అన్నారు. చేనేత కళాకారుడు హరి ప్రసాద్ తాను స్వయంగా నేసిన జీ20 లోగోను పంపించారని, అది అందరినీ ఆకర్షిస్తుందంటే మన్ కీ బాత్ లో మోదీ వ్యాఖ్యానించారు. చేనేత కార్మికుల గొప్పతనాన్ని కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించిన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆసక్తిగా తిలకించారు. జాతీయ స్థాయిలో సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ పేరు సంపాదించడం కాకుండా సిరిసిల్ల పేరును ప్రధాని మోదీచే పలికించడంతో సిరిసిల్ల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.