Ramagundam Police: రామగుండం పోలీస్ కమిషనరేట్ (Ramagundam Police Commissionerate) పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్ షాప్ యజమాలను పిలిపించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. వారి వద్ద గడ్డి మందు కొనుక్కొని వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాటిని నివారించడానికి ఈ ప్రయత్నం చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయని దానికి సంబంధించి షాప్ యజమానులకు (Fertiliser Shop Owners) అవగాహన కల్పించారు. 


గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం వలన దానిలో ఉండే అత్యధిక మోతాదు రసాయనాల వలన ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వారి శరీరంలోని అవయవాలు దెబ్బతిని తొందరగా చనిపోవడం జరుగుతుందని వివరించారు. ఎవరైనా వ్యక్తులు ఫెర్టిలైజర్ షాప్ (Fertiliser Shops) కు వచ్చి గడ్డి మందు కావాలి అని అడిగినట్లయితే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకోవాలని.. వారికి సంబంధించిన వారికి సదరు వ్యక్తి గడ్డి మందు కొనడానికి వచ్చాడా? అది వారికి అవసరమా.. కాదా? అనే సమాచారం తెలుసుకోవాలని, వారికి సంబంధించిన వివరాలు కూడా నమోదు చేసుకోవాలనీ సూచించారు. వచ్చిన వ్యక్తి వివరాలు చెప్పకపోయినట్లయితే  వారికి గడ్డి మందు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని యజమానులకు సూచించారు. 


ప్రతి ఒక్కరు ఇలా చేస్తూ రికార్డ్స్ మెయింటైన్ చేసినట్లయితే విలువైన ప్రాణాలను కాపాడి వారి కుటుంబం రోడ్డు పాలు కాకుండా వారికి మీరు పరోక్షంగా సాయం చేసిన వారు అవుతారని, తప్పనిసరిగా వివరాలు నమోదు చేస్తూ రికార్డ్స్ మెయింటేన్ చేయాలని నిర్దేశించారు. అవగాహన సదస్సు కోసం హాజరైన యజమానులు కూడా ఒక మనిషి ప్రాణం కాపాడడంలో తమ వంతు సహాయం తప్పకుండా అందిస్తామని పోలీసు వారికి సహకరిస్తామని తెలిపారు.


ఇది ఎంత ప్రమాదకరం అంటే..


క్షణాల్లో ప్రభావితం చూపించే ఈ గడ్డి మందు వల్ల ప్రాణాలు కాపాడడం వైద్యులకు అతి కష్టంగా మారింది. ఒడిశాలోని బుర్లా ప్రాంతంలో  రెండేళ్ల వ్యవధిలోనే 177 మంది దీని బారిన పడ్డారు. వారిలో ముగ్గురు మాత్రమే బతికారు. 2019 సెప్టెంబర్‌లో అక్కడి వైద్యులు నిరసన తెలపడంతో ఒడిశా ప్రభుత్వం దీన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. ఇక కేరళలో దీన్ని పూర్తిగా నిషేధించారు. దీని ప్రభావాన్ని గుర్తించిన అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ, దీనిని తొలుత తయారు చేసిన స్విట్జర్లాండ్‌లోనూ నిషేధం విధించారు. దీన్ని మన దేశంలో 25 రకాల పంటలకు ఇష్టానుసారంగా వాడుతున్నారు. దీన్ని కేవలం తొమ్మిది రకాల పంటలకే వాడాలని సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్‌ బోర్డు, రిజిస్ట్రేషన్‌ కమిటీ పేర్కొన్నప్పటికీ అవగాహన లేమితో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.


పోలీసులు సైతం ఇలాంటి వినూత్న కార్యక్రమాలు (Awareness camp over fertilizer shop owners) నిర్వహించి ఆత్మహత్యకు పాల్పడే వారి ప్రాణాలు కాపాడే విధంగా ముందస్తు చర్యలు చేపట్టడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.