తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య అటవీసిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. అందుకే తమకు ఆయుధాలు సమకూర్చాలన్న డిమాండ్‌ను సిబ్బంది గట్టిగా వినిపిస్తున్నారు. లేకుంటే తాము విధులు నిర్వర్తించలేమంటున్నారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇన్ని రోజులు గట్టిగా నినదించలేకపోయారు. తమ సహచరుడు ప్రాణాలు కోల్పోయినందున ఇప్పుడు ఆ డిమాండ్‌పై గట్టిగా పట్టుబడుతున్నారు అటవీ సిబ్బంది
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఅటవీ సిబ్బంది నిరసనలు మిన్నంటాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ఖమ్మంలో విధులకు హాజరయ్యారు ఫారెస్ట్ సిబ్బంది. శ్రీనివాసరావు హత్యను నిరసిస్తూ శాంతి ర్యాలీ చేశారు. ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు సమకూర్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఫారెస్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
ములుగు జిల్లా కేంద్రంలో అటవీశాఖ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆత్మరక్షణలో భాగంగా తమకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుత్తి కోయ గూడాలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఫారెస్ట్ సిబ్బంది. గుత్తికోయల దాడిలో మృతి చెందిన FRO శ్రీనివాసరావుకు నివాళులు అర్పిస్తూ శాంతి ర్యాలీ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు ఆందోళనకు దిగారు. పోడు సర్వే, గ్రామసభల విధులను బహిష్కరించారు. తమకు ఆయుధాలు ఇస్తేనే విధులకు హాజరవుతామని తేల్చిచెప్పారు. ఖమ్మం ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు అటవీశాఖ అధికారులు.
గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును గుత్తి కోయలు గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అధికారిని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుకు రిటైర్‌మెంట్ వరకు జీతభత్యాలు ప్రభుత్వం ఎలా అందిస్తుందో అదే విధంగా ఆయన కుటుంబానికి వేతనాన్ని అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అధికారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే అందజేయాలని ఆదేశించారు కేసీఆర్. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందన్న సీఎం... అలాంటి వారిని సహించబోమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామన్నారు.
మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌ను స్వయంగా శ్రీనివాసరావు స్వగ్రామం ఈర్లపూడి పంపపించి అంతిమ సంస్కారాలు పూర్తి చేయించారు సీఎం కేసీఆర్. శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రులు... స్వయంగా పాడె మోశారు. జోహార్ శ్రీనివాసరావు అంటూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహిళ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు.