Karimnagar News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రి కళకి ఇప్పుడు మరో జాతీయస్థాయి అవార్డు దక్కింది. గద్దె అశోక్ కుమార్ అనే కళాకారుడు 2018లో కిలోన్నర వెండి తీగలతో వెండి పల్లకిని అద్భుతంగా తయారుచేశారు. దానిని అప్పట్లో జాతీయ అభివృద్ధి సంస్థకు పోటీ నిమిత్తమై పంపించారు. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ పోటీ రిజల్ట్స్ ఈ మధ్య వెలువడ్డాయి. అందులో సిల్వర్ ఫిలిగ్రీ వెండి పల్లకికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానం అందింది. ఈనెల 28న దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయనున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ఇళ్లల్లో కొలువుదీరిన సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
సిల్వర్ ఫిలిగ్రి చరిత్ర ఇదీ
కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు ఏళ్లనాటి చరిత్ర ఉంది. దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిజాం నవాబుల హయాంలో మొదలై క్రమక్రమంగా ప్రాచుర్యం పొందిన ఈ ఆర్ట్ ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో ప్రాముఖ్యత వహించింది. అప్పటి నుంచి స్వర్ణకారుల చేతిలో రూపుదిద్దుకున్నటువంటి ఈ అద్భుతమైన కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో దేశాధినేతలు ఇతర ప్రముఖుల ఇళ్లలో కొలువుతీరాయి. భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ తో చేసిన కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తోంది. చారిత్రక ప్రదేశాలు అయిన చార్మినార్ , తాజ్ మహల్ , ఎర్రకోట, వీణ , మయూరం , ఇతర దేవుళ్ల ఆకృతులు, ప్రముఖ స్థలాలను సిల్వర్ ఫిలిగ్రీ ద్వారా సుందరంగా రూపొందించేవారు. సామాన్యులను కూడా ఆకర్షించేలా చిన్న చిన్న వస్తువులను సైతం తయారు చేయడం ప్రారంభించామని వీటి తయారీదారులు అంటున్నారు. తాళంచెవి, సిగరెట్ యాష్ ట్రే , ఇంకా అనేక రకాల తక్కువ ధరలో దొరికే జ్ఞాపికలను గిఫ్ట్ గా ఇవ్వడానికి తయారు చేయిస్తున్నామని అంటున్నారు.
ఇవాంకా ట్రంప్ కు గిఫ్టుగా
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే దేశ విదేశీ ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో చేసిన వీణ, చార్మినార్ కానీ గిఫ్ట్ గా ఇస్తుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన సందర్భంలో అతిథులుగా వచ్చిన దేవేంద్ర ఫడ్నవిస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు సిల్వర్ ఫిలిగ్రీ తో చేసిన జ్ఞాపికలును గిఫ్ట్ గా అందించారు. హైదరాబాద్ ను సందర్శించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ కి కూడా కరీంనగర్ కళాకృతులను అందించారు. అయితే గతంలో సిల్వర్ ఫిలిగ్రీ ని నమ్ముకుంటే తమకు సరైన ఉపాధి లభించేది కాదని కానీ ఇప్పుడు ఇతర దేశాల నుంచి సైతం వస్తున్న ఆర్డర్ల వల్ల తమకు చేతినిండా పని దొరుకుతుందని కళాకారులు అంటున్నారు. అయితే మార్కెటింగ్ విషయంలో మరింత శ్రద్ధ చూపినట్లయితే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించ గలిగే సత్తా ఉన్న పరిశ్రమ అని వారి అభిప్రాయం. ఇప్పటికే కుటీర పరిశ్రమగా మారి అనేక మంది మహిళలకు ఉపాధి అందిస్తున్న దీనిపై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడితే కచ్చితంగా రానున్న రోజుల్లో టర్నోవర్ మరింత పెరుగుతుందనంటున్నారు.