ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అవతార్-2. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్ డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. 13 సంవత్సరాల క్రితం విడుదలైన ‘అవతార్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ విజువల్ వండర్ గా నిలిచింది. సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.    


భారత్ లో 7 భాషల్లో విడుదల


ఇక భారత్ లో ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు 7 భాషల్లో విడుదల కాబోతోంది.  అంతేకాదు, ఐమ్యాక్స్‌ 3డీ, 4డీఎక్స్‌ 3డీ ఫార్మాట్‌ లలో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఆ స్క్రీన్‌ మీదే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అటు ఈ చిత్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా టికెట్స్ బుకింగ్ ఇప్పటికే మొదలయ్యాయి. పలు టికెట్ బుకింగ్ సైట్స్, యాప్స్ లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, అవతార్-2 సినిమా టికెట్ల ధరలు చూసి సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. 


టికెట్స్ ధర చూసి షాక్ అవుతున్న ఆడియెన్స్


బెంగళూరులోని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌ కలిగిన థియేటర్‌ లో టికెట్‌ ధర ఏకంగా రూ.1,450గా ఉన్నట్లు టికెట్ బుకింగ్ సైట్స్ చూపిస్తున్నాయి.  పుణెలో రూ.1200, ఢిల్లీలో రూ.1000గా ధర పలుకుతోంది. ముంబైలో రూ.970, కోల్‌కతా రూ.770, అహ్మదాబాద్‌ రూ.750, ఇండోర్‌ రూ.700 ఉండగా, హైదరాబాద్‌లో ఒక్కో టికెట్‌ ధర రూ.350 ఉంది. విశాఖలో రూ.210గా నిర్ణయించారు. అయితే ఈ ధరలు కేవలం సీట్లకు మాత్రమే. వీటికి ఇతరత్రా పన్నులు తోడైతే ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది.  


2009లో ‘అవతార్‘ సంచలన విజయం


2009లో ‘అవతార్’ సినిమా విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దర్శకుడు కామెరూన్ హై ఎండ్ టెక్నాలజీతో అవతార్ యూనివర్స్ లో ఈ అండర్ వాటర్ అడ్వెంచర్ మూవీని రూపొందించారు. కామెరూన్ తెరకెక్కించిన సినిమాలు ఇంత వరకు ఎన్నడూ పరాజయాన్ని చవిచూడలేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ‘అవతార్’ వస్సూళ్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు 'అవతార్ 2' పైనా అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు.  250 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందించారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,026 కోట్లు.


ఆకట్టుకుంటున్న ‘అవతార్-2‘ ట్రైలర్


3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ ఉన్న అవతార్-2 సినిమా డిసెంబర్ 16 న దేశ వ్యాప్తంగా 3 వేలకు పైగా స్క్రీన్స్ పై రిలీజ్ కాబోతోంది. తాజాగా విడుదలైన ‘అవతార్-2’ ట్రైలర్‌ ఆడియెన్స్ ను ఎంతో ఆకట్టుకుంటోంది. జేక్‌ సల్లీ, నెయ్‌తిరి తమ పిల్లలకి నీటిలో డ్రాగన్ పై ఎలా స్వారీ చేయాలో నేర్పుతుంటారు. అటు మరోసారి తమపైకి దండిత్తె వచ్చే మానవులను ఎలా ఎదుర్కొన్నారో చూపించే ప్రయత్నం చేశారు కామెరూన్, నీటి లోపలి పండోరా ప్రపంచాన్ని అద్భుతంగా చూపించబోతున్నారు. ఈ సినిమాలో సామ్‌ వర్దింగ్టన్‌, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్‌, కేట్‌ విన్స్‌లెట్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.


Read Also: కమల్ హాసన్‌కు అస్వస్థత, హైదరాబాద్ నుంచి వెళ్లగానే హాస్పిటల్‌కు తరలింపు!