దేశవ్యాప్తంగా ‘కాంతార’ సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి, సమంతల్లో ఎవరిని ఎంచుకుంటారని ఒక విలేకరి ప్రశ్న అడిగాడు. దీనికి రిషబ్ శెట్టి సమాధానం ఇస్తూ సాధారణంగా తాను స్క్రిప్ట్ పూర్తయ్యాకనే నటీనటులను ఎంచుకుంటానని, కొత్త వారికి ప్రిఫరెన్స్ ఇస్తానని అన్నారు. అయితే ఆ తర్వాత గాల్లో రెండు చేతులతో కొటేషన్ సింబల్ చూపిస్తూ ఇలాంటి హీరోయిన్లు తనకు నచ్చరని, కానీ సాయిపల్లవి, సమంతలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.


అయితే రిషబ్ కౌంటర్ వేసింది రష్మికకేనని ఇప్పుడు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇటీవలే రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ అవకాశం రావడం వెనకున్న కథ చెప్పారు. ఒక అందాల పోటీలో తను గెలిచానని, ఆ సమయంలో తన ఫొటో ఒక ప్రముఖ దినపత్రిక మొదటి పేజీలో వచ్చిందని, అప్పుడు తనకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ గురించి తెలిపే సమయంలో రష్మిక రెండు చేతులతో గాల్లో కొటేషన్ సింబల్ చూపిస్తూ మాట్లాడటంతో అది బాగా వైరల్ అయింది. తను వెటకారంగా ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు విరుచుకుపడ్డారు.


‘కిరిక్ పార్టీ’ సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకుడు. సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టినే ఆ సినిమాను నిర్మించాడు కూడా. రష్మిక చేసిన వ్యాఖ్యలకు రిషబ్ శెట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో రష్మిక కన్నడనాట ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటంతో వారిద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోయింది. చేసుకున ఆ వెంటనే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పక్కనే ‘అంజనీ పుత్ర’ సినిమాలో అవకాశం వచ్చింది.


‘ఛలో’తో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన రష్మిక ‘గీత గోవిందం’తో ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత రక్షిత్ శెట్టితో విభేదాలు రావడంతో ఎంగేజ్‌మెంట్ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత రష్మిక కన్నడంలో ఎక్కువ సినిమాలు చేయలేదు. దర్శన్ హీరోగా నటించిన ‘యజమాన’, ధ్రువ్ సర్జా ‘పొగరు’ సినిమాల్లో మాత్రమే నటించింది. ఇప్పుడు రష్మిక, రిషబ్‌ల వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా? ఇంకా తీవ్రస్థాయికి చేరుకుంటుందా అనేది చూడాలి!