సమంత హీరోయిన్‌గా నటించిన యశోద ‘సూపర్ హిట్’ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సమంతకు ఏ హీరోకు ఇవ్వని మాస్ సాంగ్ ఇచ్చానని, కానీ దాన్ని సినిమాలో పెట్టలేదని మెలోడీ బ్రహ్మ మణిశర్మ అన్నారు. ఈ సినిమాకు ఆయనే సంగీత దర్శకత్వం వహించారు.


యశోద కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మణిశర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుంచో సమంతతో పని చేయాలనుకుంటున్నానని, కానీ ఇన్నాళ్లకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కుదిరాయన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ సినిమాకు కూడా తనే సంగీతం అందిస్తున్నానని తెలిపారు.


ఈ సినిమా కోసం మూడు సాంగ్స్ ఉన్నాయని, కానీ ఇంతవరకు వాటిని విడుదల చేయకుండా తనని మోసం చేశారని నవ్వుతూ అన్నారు. సినిమాలో ఒక పాట చాలా బాగా వచ్చిందని, ఆ ఒక్క పాట కోసం సమంత అందరినీ గడగడలాడించిందన్నారు. కానీ ఆ పాట కూడా సినిమాలో లేకుండా చేశారని తెలిపారు. తర్వాత అయినా ఆ పాటలు విడుదల చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇక 'యశోద' కలెక్షన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మాత్రమే కాదు... ఓవర్సీస్ మార్కెట్‌లోనూ 'యశోద'కు మంచి వసూళ్లు వస్తున్నాయి. 


ఓవర్సీస్‌లో అదరగొడుతున్న సమంత
అమెరికా, ఆస్ట్రేలియాలో 'యశోద'కు ఆదరణ బావుంది. ముఖ్యంగా అమెరికాలో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 426156 డాలర్లు కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీలో సుమారు మూడున్నర కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో 53,590 డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే... 29 లక్షలు అన్నమాట. ఇంకా కెనడా, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ కలెక్షన్స్ కలిపితే ఈజీగా నాలుగు కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లకు రెండు నెలల తర్వాత లాభాలు తీసుకు వచ్చిన సినిమా 'యశోద' అని టాక్. శనివారమే అమెరికా డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిసింది.   ఏపీ, తెలంగాణ, తమిళనాడు... ఇండియాలో రోజు రోజుకూ 'యశోద' కలెక్షన్స్‌లో గ్రోత్ ఉందని సినిమా వర్గాలు చెప్పాయి.