China Covid-19 Cases: చైనా (China)లో కరోనా మళ్లీ చుక్కలు చూపిస్తోంది. మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి చైనాలో ఎన్నడూ లేనంతగా రోజువారీ కొవిడ్ కేసులు (Daily Corona Cases) వెలుగు చూశాయి. ఇన్ఫెక్షన్ల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. చైనాలో బుధవారం 31,545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 27,517 లక్షణాలు లేని కేసులు ఉన్నాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది.


ఏం చేసినా సరే!


దేశంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, స్నాప్ లాక్‌డౌన్లు, మాస్ టెస్టింగ్, ట్రావెల్ పరిమితులు, ఇలా ఏం చేసినా సరే కరోనా వ్యాప్తిని చైనా అడ్డుకోలేకపోతుంది.


140 కోట్ల చైనా జనాభాతో పోలిస్తే ఈ కేసులు తక్కువైనప్పటికీ, జీరో కొవిడ్ పాలసీ అమల్లో ఉన్నా ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీరో కోవిడ్ విధానం ప్రకారం, చిన్న స్థాయిలో కరోనా వ్యాప్తి కనిపించినా ఆ నగరం మొత్తాన్ని లాక్‌డౌన్ చేస్తారు. కరోనా సోకిన రోగులను నగరానికి దూరంగా ఉంచుతారు.


మెగాసిటీ షాంఘై లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు ఏప్రిల్ మధ్యలో నమోదైన 29,390 ఇన్‌ఫెక్షన్‌లను బుధవారం గణాంకాలు మించిపోయాయి. ప్రజలు ఆహారం కొనడానికి, వైద్య సంరక్షణ పొందటానికి తంటాలు పడుతున్నారని నివేదిక పేర్కొంది.


6 నెలల తర్వాత


చైనాలో 6 నెలల తర్వాత ఇటీవలే మళ్లీ కొవిడ్ మరణం నమోదైంది. చైనాలో చాలా నగరాల్లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ మరణాలు మాత్రం నమోదు కావడం లేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ తాజాగా బీజింగ్‌కు చెందిన ఓ 87 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. దీంతో చైనాలో ఇప్పటివరకు కొవిడ్‌ కారణంగా 5,227 మంది మృతి చెందినట్లయింది.


కరోనా వైరస్‌ కట్టడికి చైనా అవలంబిస్తోన్న జీరో కొవిడ్‌ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా క్వారంటైన్‌లో ఉన్న ఓ చిన్నారికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఇటీవలే ఓ మూడేళ్ల చిన్నారి కూడా మృతి చెందింది. 


చైనాలోని ఝేంగ్‌జువా నగరంలోని లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. లక్షల మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. లక్షణాలున్నవారిని నగరానికి దూరంగా ఉన్న క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నారు. ఇలాగే ఓ కుటుంబం నగరానికి దూరంగా ఉన్న హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంది. ఈ క్రమంలోనే వారి నాలుగు నెలల పాపకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసర వైద్యం కోసం ప్రయత్నించారు. కానీ, కొవిడ్‌ ఆంక్షల కారణంగా అధికారులు బయటకు వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో చిన్నారి మృతి చెందింది.


Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో జోష్- అన్నయ్యతో కలిసి అడుగులేసిన ప్రియాంక గాంధీ