Ramagudam News: ఆధునిక సాంకేతిక హంగులున్న స్మార్ట్ ఫోన్లు.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్దా ఉంటున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్లు కనీస అవసరాలుగా మారిపోయాయి. కానీ ఈ ఫోన్లు, ఇంటర్నెట్ వల్లే చాలా మంది మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో ఇరుక్కుపోయి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులన్నీ కోల్పోతున్నారు. అయితే అలాంటి సమస్యలు ఎదురైన వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలని.. పోలీసులు చెబుతున్నారు. కోల్పోయిన సొమ్మును తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930ను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి  ప్రజలకు సూచించారు.


ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు...



  1. మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి సైబర్ నేరగాడు కాల్ చేసి నేను ధని ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను మీకు 20,000 లోన్ సాంక్షన్ అయింది. మీరు లోన్ పొందాలి అనుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం కొంత అమౌంట్ మరియు టాక్స్ కోసం కొంత అమౌంట్ చెల్లించాలి అని చెప్పి బాధితుడి వద్ద నుంచి డబ్బులు కాజేశాడు.

  2. సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి పాన్ కార్డు లింక్ చేయాలి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది అనే మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆ మెసేజ్ లో ఉన్న లింకుని క్లిక్ చేసి తన వివరాలు తన ఏటీఎం కార్డు వివరాలు తాను రిసీవ్ చేసుకున్న ఓటీపీలు కూడా ఎంటర్ చేశాడు. వెంటనే బాధితుడు అకౌంటు నుంచి ఏడు వేల రూపాయలు పోయాయి.

  3. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు గూగుల్లో ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేసి కాల్ చేయగా అది సైబర్ నేరగాడికి కనెక్ట్ అయింది. ఆ సైబర్ నేరగాడు మీ వస్తువు మీకు డెలివరీ అవ్వాలి అంటే నేను ఒక లింకు పంపిస్తాను.. ఆ లింకు ద్వారా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి నాకు ₹5 అమౌంట్ పంపండి అని చెప్పగా బాధితుడు సైబర్ నేరగాడు పంపిన లింక్ ని క్లిక్ చేశాడు. తన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాడు. వెంటనే బాధితుడు అకౌంట్ నుంచి 20 వేల రూపాయలు పోయాయి.

  4. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు లోను తీసుకుందామని కొన్ని లోన్ అప్లికేషన్లలో తన ఎలిజిబిలిటీని చెక్ చేసుకున్నాడు. కానీ లోన్ తీసుకోలేదు. అయినప్పటికీని మీరు లోన్ తీసుకున్నారు రీ పే చేయాలి అంటూ బాధితుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

  5. రామగుండం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మీ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ని పెంచుతాము దానికోసం మీ కార్డు వివరాలు తెలపాలి అని కోరగా బాధితుడు తన కార్డు వివరాలు, తాను రిసీవ్ చేసుకున్న ఓటీపీలు అన్నీ చెప్పేశాడు. వెంటనే బాధితులు ఎకౌంట్ నుంచి 20వేల రూపాయలు డెబిట్ అయ్యాయి. 

  6. మంచిర్యాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి పార్ట్ టైం జాబ్ గురించి మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత వాట్సాప్ లో మరోక లింక్ పంపి, ఈ లింక్ క్లిక్ చేయండి కొన్ని వస్తువులు ఉంటాయి. ముందు మీరు ఆ వస్తువులను మీ డబ్బులతో కొనండి. ఆ తర్వాత కమిషన్ తోపాటు మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాము అని చెప్పగా, Rs. 80 వేలు తో పలు దఫాలుగా కొన్ని వస్తువులను కొన్నాడు. కమిషన్ తో కలుపుకొని మొత్తం డబ్బు వ్యాలెట్ లో కనిపిస్తుంది కానీ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదరట్లేదు. మీరు మరొ కొన్ని వస్తువులు కొనండి అప్పుడే మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదురుతుంది అంటూ వల విసురుతున్నారు.

  7. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడి ఫొటోలను సైబర్ నేరగాడు ఇన్ స్టాగ్రామ్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బాధితులు యొక్క స్నేహితులని బంధువులని డబ్బులు అడుగుతున్నాడు.


పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలు..



  • సోషల్ మీడియాలో యాడ్స్ చూసి ఆఫర్ లో వస్తున్నాయని, ఆ యాడ్స్ లో ఉండే నంబర్స్ కి కాల్ చేసి సైబర్ మోసాలకు గురి కావొద్దు. 

  • నకిలీ హెల్ప్ లైన్ నంబర్ లను ఉంచుతారు. మీరు ఆ నంబర్ కు కాల్ చేస్తే సైబర్ మోసగాళ్లు మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని సేకరించి, మిమ్మల్ని సులువుగా మోసం చేస్తారు.

  • ఉచితంగా వచ్చే అన్నీ మంచివి కావు. ఆన్ లైన్ చెల్లింపులు చేయడానికి అసురక్షిత /పబ్లిక్ వైఫై నెట్ వర్క్స్ ను ఉపయోగించవద్దు.