Karimnagar: చేసింది కొంత చూపింది కొండంత... చేయంది కూడా కొండంత చూపించారు. ఇప్పుడు లెక్కలు బయటకు వస్తుంటే కళ్లు తేలేస్తున్నారు. ఇది కరీంనగర్‌లో గ్రామపంచాయితీల పని తీరు. పైసలు రావడం లేదని ఇన్నాళ్లు గోల చేసినోళ్లంతా వచ్చిన పైసలు ఎలా ఖర్చు పెట్టారో చెప్పలేక నీళ్లు నములుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామపంచాయతీల్లో నిధులకు సంబంధించి ఆడిటింగ్ లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. అభివృద్ధి పనులు చేయకపోయినా చేశామంటూ డబ్బులు ఖర్చుచేశారని ఆడిటింగ్ లో అధికారులు గుర్తించారు. ఆ నిధులను వ్యక్తిగతంగా వాడుకున్నారని తేల్చారు. 2021- 22 సంవత్సరానికి చేసిన ఖర్చులకు సంబంధించి ఆడిటింగ్ లో ఇవి బయటపడుతున్నాయి.
మొత్తం 1215 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు దాదాపు 400లకుపైగా ఊళ్లలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో కొన్నింటిపై విచారణ జరిగింది. మిగిలిన వాటిపైనా దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వాటిల్లోనూ నిధుల వినియోగంపై లెక్కలు తేల్చాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ జరిగింది
గ్రామపంచాయతీలకు సరైన విధంగా నిధులు విడుదల చేయడం లేదంటూ ఈ మధ్య ఉమ్మడి జిల్లాకి చెందిన కొందరు సర్పంచులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మరోవైపు అనేక గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా అన్నింటిలోనూ సరైన రసీదులను సమర్పించకపోవటంతో పాటు ...మార్కెట్ రేటు కంటే ఎక్కువగా బిల్లులు వేయడం, పైగా లేని నిబంధనలను పాటించడం, ఇక అన్నిటికంటే వింతగా అసలు చేయని పనులకు సైతం నిధులను డ్రా చేయడం లాంటి సమస్యలను గుర్తించారు. వీటిపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పలువురు నేరుగా ప్రజావాణిలోనే ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మరోసారి నిధుల వినియోగంపై తనిఖీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమైన గ్రామపంచాయతీల సర్పంచుల నుంచి నిధులు తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేసినా అవి సత్ఫలితాలు ఇవ్వడంలేదు.
ఇది పంచాయతీల లెక్క..
కరీంనగర్ లోని కొత్త జిల్లాల్లో జగిత్యాలలో 381 పంచాయతీలు ఉండగా 379 పంచాయతీల్లో ఆడిట్ లు జరగనున్నాయి. ఇక కరీంనగర్లో 313 జీపీలకు 296 జీపీలలో ఆడిట్ నిర్వహించనున్నారు. పెద్దపల్లిలో 266 వరకు గాను 266 పంచాయతీల్లోనూ.. సిరిసిల్లలో 255 గ్రామ పంచాయతీలకు గాను 246 గ్రామపంచాయతీలో ఆడిట్ జరగనుంది. మొత్తం 1215 గ్రామపంచాయతీల్లో 1187 గ్రామ పంచాయతీలకు అభ్యంతరాలు వ్యక్తం అవడం గమనార్హం.
ఇక అభ్యంతరాల సంఖ్య చూసినట్లయితే ఉమ్మడి జిల్లాలో 2019- 20 కి గాను 3629 అభ్యంతరాలు రాగా 2020-21లో 20,186 అభ్యంతరాలు వచ్చాయి. ఇక 2021 -22లో ఏకంగా 21,689 అభ్యంతరాలు రావడం వీటి సంఖ్య ఎంతలా పెరిగిందో సూచిస్తుంది. ఇక తీవ్ర నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ స్థానిక ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: కన్నీరు దిగమింగి క్రీడా పోటీల్లో పాల్గొన్న ఎఫ్‌ఆర్‌ఓ కుమార్తె!
Also Read: లోన్ యాప్ లో అప్పు చేసి స్నేహితులకు సాయం, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య!