Loan App Threats : : రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా లోన్ యాప్ నిర్వాహకుల తీరు మారడంలేదు. ఇచ్చిన అప్పుకు మూడింతలు వసూలు చేయడమే కాకుండా అప్పు చేసిన వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. అత్యవసరంలో అప్పు కోసం ఆన్ లైన్ లోన్ యాప్ వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘనలు నిత్యం ఏదొక చోట వెలుగులోకి వస్తున్నాయి. మేం చెప్పినంత డబ్బు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతాం, మీ బంధులకు పంపంచి మీ పరువు తీస్తామన్న లోనాసురుల బెదిరింపులతో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. లోన్ యాప్ లో అప్పు చేస్తే ఇక ఆత్మహత్య శరణ్యం అన్నట్లు చేస్తున్న కేటుగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎంతలా ప్రయత్నిస్తున్నా పరిష్కారాలు మాత్రం చూపలేకపోతున్నాయి. తక్కువ వడ్డీకే లోన్ అంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లోన్ యాప్ లను అదుపుచేసేందుకు మరింత కఠిన చట్టాలు చేయాలని బాధిత కుటుంబాలు అంటున్నాయి. ఈ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు ప్రాణం కోల్పోయాడు.
కరీంనగర్ యువకుడు ఆత్మహత్య
లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైంది. కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ లోని సాయినగర్ చెందిన శ్రీరాముల శ్రవణ్ అనే యువకుడు లోన్ యాప్ లో దాదాపు మూడు లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అందులో కొంత డబ్బులను తన మిత్రులకు ఇచ్చాడు. వారు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ సంస్థల నిర్వాహకుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిన శ్రవణ్ 23వ తేదీన కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతడిని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో శ్రవణ్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు పంపించారు. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ పొందుతూ గురువారం ఉదయం శ్రవణ్ మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
సైబర్ నేరగాళ్ల కొత్త పంథా
తరచూ మన మొబైల్ ఫోన్‌లకు, పర్సనల్ మెయిల్స్‌కు చిత్రవిచిత్ర మెసేజ్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ లింక్ క్లిక్ చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని, తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించండి అని మెసేజ్‌లు వస్తుంటాయి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీ ఖాతాలో లక్ష రూపాయలు జమ అవుతాయి అంటూ రకరకాల మెసేజ్‌లు రావడం తరచుగా చూస్తూనే ఉంటాం. పొరపాటున ఆ లింక్ లను క్లిక్ చేశారో మీరు బుక్కైనట్టేనని వరంగల్ సీపీ తరుణ్ జోషి ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలా లింకులు పంపిస్తూ వాటి ద్వారా మీ ఖాతాల్లో ఉన్న నగదును కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. తస్మాత్ జాగ్రత అంటున్నారు వరంగల్ పోలీసులు.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతే విషయాన్ని దాటిపెట్టకుండా సత్వరం పోలీసులను ఆశ్రయించాలన్నారు. 1930 నెంబర్ కు కాల్ (Call Centre Number) చేయాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వరంగల్ సీపీ
తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు అమాయకులు వారి ఉచ్చులోపడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డ్స్, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ ఆఫర్లతో సులభంగా డబ్బు సంపాదించొచ్చని జనానికి ఆశలు రేకెత్తించి.. నిలువునా ముంచుతున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేతున్నారు. ఈ మధ్య కాలంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇలాంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరస్తుల మాయలోపడి నిత్యం ఏదోచోట డబ్బులు పోగొట్టుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.