Khammam News: గుత్తికోయల చేతిలో హత్యకు గురైన అటవీ అధికారి హత్యకు శ్రీనివాసరావు గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. వారు రోదిస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టారు. అయితే ఆయన మృతి గురించి ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. కానీ తండ్రి చనిపోయిన నాలుగు రోజులకే.. కంటనీరు కారుస్తూనే వెళ్లి క్రీడా పోటీల్లో పాల‌్గొంది ఆయన కూతురు కృతిక. ఆ చిన్నారి మనోధైర్యం ముందు ఓటమి కూడా ఓడిపోయింది. అంతేకాదు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకుంది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ఎఫ్ఆర్ఓ సీహెచ్ శ్రీనివాసరావు ఈనెల 22వ తేదీన గుత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి కోరిక, ప్రోత్సాహంతో అథ్లెటిక్స్ లో రాణిస్తున్నపదేళ్ల కుమార్తె కృతిక.. తండ్రి చనిపోయిన నాలుగు రోజుల్లోనే మనోధైర్యం చాటుకుంది. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి ఖమ్మం సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ కు బంధువుల సాయంతో హాజరైంది. డిసెంబర్ 5, 6వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయింది. ఈ సందర్భంగా నిర్వాహకులు, కోచ్ లు చిన్నారి మనోస్థైర్యాన్ని చూసి ముచ్చటపడిపోయారు. అభినందనలు, ప్రశంసల వెల్లున కురిపించారు. కృతిక ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది.
అసలేం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోయారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను పోడుభూమి సాగుదారులు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహం చెందారు.
వారు సహనం కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ అధికారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు చేసిన దాడిలో గిరిజనులకు గాయాలైనప్పటికీ తొలిసారిగా సాగుభూమిదారులు దాడి చేయడం, ఈ దాడిలో రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, పోడుభూమి సాగుదారుల దాడిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరణించిన ఎఫ్ ఆర్ వో కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో ఉంటే ఏవిధంగానైతే జీతభత్యాలు అందుతాయో.. ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.