Ramagundam News : రామగుండం ఆర్ఎఫ్సీఎల్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదురుతోంది. ఉద్యోగాల కోసం లక్షలు చెల్లించిన కార్మికులు కొద్దికాలం పాటు పనిచేసిన తరువాత కంపెనీ యజమాన్యం వారిని విధుల నుండి తొలగించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా లక్షల్లో డబ్బులు కట్టిన  ఓ యువకుడు ఉద్యోగం పోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లాలో ముంజ హరీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .


అసలేం జరిగింది?


కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాపూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు ఏడాది క్రితం దళారులకు రూ.8 లక్షల వరకు చెల్లించి రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగంలో చేరాడు. అయితే తాను చేరిన సమయంలో ఉద్యోగం పర్మినెంట్ అవుతుందంటూ దళారులు అతన్ని మభ్యపెట్టడంతో అప్పుచేసి మరీ వారికి డబ్బులు చెల్లించాడు. అయితే కాంట్రాక్టర్ మారడంతో కొత్తగా వచ్చిన కంపెనీ పాత ఉద్యోగులను తొలగించింది. దీనిపై గత కొంతకాలంగా ఉద్యోగులంతా కలిసి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. తమను మోసం చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. అప్పులు తెచ్చి లక్షల్లో చెల్లించామని, ఉద్యోగాలు పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. 


ఎమ్మెల్యే అనుచరులే కారణమా? 


ఇక ఈ అంశం కాస్త పొలిటికల్ గా కూడా మారింది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సోమరపు సత్యనారాయణ ఈ విషయంపై స్పందించారు. ఎమ్మెల్యే  కోరుకొండ చందర్ అనుచరుల హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. రెండు రోజుల క్రితమే మావోయిస్టు పార్టీ పేరుతో ఓ లేఖ కూడా కలకలం రేపింది.  అందులో ఎమ్మెల్యే అనుచరులే డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని ఈ మొత్తం దాదాపు రూ.45 కోట్ల వరకు ఉంటుందని బాధితుల అందరికీ తిరిగి ఆ డబ్బులు ఇచ్చి వేయాలంటూ.. లేదంటే ప్రజా కోర్టులో శిక్షిస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఈ అంశం మరింత చర్చనీయంగా మారింది.  


సోషల్ మీడియాలో పోస్టు 


అయితే ఇప్పటి వరకు ఓపిక పట్టిన తాను ఇక అప్పుల బాధ భరించలేనని కనీసం తన చావుతో అయినా మిగతా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హరీష్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో హరీష్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు లోకేషన్ ట్రేస్ చేశారు. అయితే హరీష్ ఆత్మహత్యకు పాల్పడాలని భావనతో బావిలో దూకాడు. కమాన్పూర్ శివారులలో ఉన్న బావిలో శవమై తేలడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న హరీష్ ఎన్నో ఆశలతో ఉద్యోగం కోసం డబ్బులు ఖర్చు పెట్టాడని.. అయితే దళారులు అతని ఆశని ఆసరా చేసుకొని మోసం చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. 


Also Read : Maoist Letter : రామగుండం ఎమ్మెల్యేకు మావోయిస్టుల బెదిరింపు లేఖ, ఉద్యోగాల పేరిట రూ.45 కోట్లు వసూలు చేశారని ఆరోపణ