Maoist Letter :రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ కు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల పేరిట భారీగా డబ్బు వసూలు చేశారని లేఖలో ఆరోపించారు. ఆ డబ్బును బాధితులకు తిరిగి ఇచ్చేయాలని లేని పక్షంలో శిక్ష తప్పదని హెచ్చరించారు మావోయిస్టులు. 


రూ. 45 కోట్లకు పైగా వసూళ్ల ఆరోపణలు! 


రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ అనుచరులు రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్  ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని సీపీఐ(మావోయిస్టు) జేఎండబ్ల్యూజే డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఒక లేఖ వైరల్ అవుతోంది. స్వయానా సింగరేణికి చెందిన  ఎమ్మెల్యే చందర్ రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల విషయంలో తన అనుచరులను ముందుంచి దాదాపుగా రూ.45 కోట్లకు పైగా వసూలు చేశారని లేఖలో ఆరోపించారు. ఇందులో అతని వెంట తిరిగే బొమ్మ గాని తిరుపతి గౌడ్, మోహన్ గౌడ్ , కుంటి రాజు , పెంట రాజేష్, సిలివేరు రవిచందర్, బంటి, రవి, అజయ్ ,అంబటి నరేష్ ,జగదీష్ వంశీలతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు కుమ్మక్కు అయి 790 మంది దగ్గర దాదాపుగా రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని లేఖలో తెలిపారు. 


ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు! 


ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని, ఈఎస్ఐ, పీఎఫ్, ఇతర సౌకర్యాలు ఉండాయని అమాయక ప్రజల్ని మోసం చేసి భారీగా డబ్బు వసూలు చేశారని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. పైగా అందులో ఎవరికీ కూడా ఉద్యోగం పర్మినెంట్ కాలేదనిస, కాంట్రాక్టర్ మారిపోవడంతో పాత వారిని తొలగించి, బిహార్ వారిని తీసుకుంటున్నారన్నారు. పాత వారిని తొలగించే ప్రయత్నం చేస్తుండడంతో  అటు ఆర్థికంగానూ ఇటు ఉద్యోగ పరంగా కార్మికులు నష్టపోయారన్నారు. ఆర్ఎఫ్సీఎల్ లాస్ లో ఉందని 1999లో మూసివేశారు. దానిని కేంద్ర ప్రభుత్వం 2017లో తిరిగి ప్రారంభించింది. అయితే ఆ కంపెనీలో లోడింగ్ అన్లోడింగ్ పనులకు సంబంధించిన ఉద్యోగాలకు బెంగాల్ కి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు దక్కగా మొత్తం 900 మంది కార్మికులు ఆ సమయంలో అవసరం అయ్యారు. ఆ ప్రైవేట్ కంపెనీ అవసరాన్ని అనుకూలంగా మలుచుకున్న స్థానిక ఎమ్మెల్యే తన బంధువులు అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ మారిపోవడం, ప్రస్తుతం ఇదంతా కూడా బయటకు రావడంతో కేసులు పెట్టకుండా అందర్నీ మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక చట్టపరమైన చర్యలు తప్పవంటూనే వీలైనంత తొందరగా వారందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మావోయిస్టులు హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అనుచరులను సైతం అదుపులో ఉంచుకోవాలని లేఖలో మావోయిస్టులు తెలిపారు. కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకుంటే ప్రజల సమక్షంలోనే శిక్షిస్తామంటూ లేఖలో పేర్కొనడంతో పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపింది.





ఇంతకీ ఆ లేఖ నిజమేనా?


అయితే మావోయిస్టుల పేరుతో బయటకు వచ్చిన ఆ లేఖపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో మావోయిస్టులకు పలు సంఘాలతో నేరుగా సంబంధాలు ఉండడం కార్మిక వర్గాల్లో మంచి పట్టు ఉండడంతో అప్పట్లో వారి హవా నడిచేది. అయితే పోలీసులు తీసుకున్న కఠినమైన చర్యల వల్ల దాదాపుగా మావోయిస్టు పార్టీ ఈ ప్రాంతంలో తుడిచిపెట్టుకుపోయింది. ఇలాంటి సమయంలో ఎవరైనా మాజీలు తమకు సంబంధించిన బాధితుల తరఫున ఇలా ఒక లేఖ సృష్టించారేమోనని అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి చందర్ వివరణ ఇచ్చారు.  రాజకీయంగా దీన్ని వాడుకోవాలని ఉద్దేశంతో ఎవరైనా మార్ఫింగ్ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఒకవేళ ఈ లేఖ నిజమైతే.. సైలెంట్ గా ఉన్న మావోయిస్టు పార్టీ నేతలు ఈ అంశంపై స్పందించడం పట్ల  అధికార పార్టీ నేతలు, కార్యకర్తలలో కొంత భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.


Also Read : Komatireddy Rajagopal: గడియారాలు కాదు, కిలో బంగారం ఇచ్చినా ఓటమే! కేసీఆర్‌లో భయం - కోమటిరెడ్డి వ్యాఖ్యలు