మునుగోడు కేంద్రంగా రాజకీయం రోజురోజుకూ మరింత ముదురుతోంది. వివిధ పార్టీల నేతలు ఒకరిపైమరొకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని జీఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ పరిస్థితి గురించి మాట్లాడుతూ.. అక్కడ టీఆర్ఎస్ గెలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.


కాళేశ్వరం ప్రాజెక్టులో వెనకేసిన అవినీతి సొమ్ముతో మునుగోడు ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పటికే ప్రజలకు గోడ గడియారాలు పంచుతున్నారని, మునుగోడు ప్రజలకు ఇంటికి కిలో బంగారం ఇచ్చినా సరే టీఆర్ఎస్ ను ప్రజలు ఓడిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు భయం మొదలైందని మొన్నటి మునుగోడు సభతో తేలిపోయిందని చెప్పారు. 


పొలాల్లో బోర్లకు మీటర్లు పెడతారంటూ రైతులను భయపెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనను అంతం చేయడం కోసం చేస్తున్న ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలే చివరికి విజయం సాధిస్తారని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు ఈ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం కలిగిన వారని, కేసీఆర్ గిమ్మిక్కులకు వారు పడిపోరని అన్నారు.


Also Read: Munugode Bypolls : మునుగోడులో ప్రచాారానికి అన్న - ఎప్పుడైనా రెడీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి !


బీజేపీ వల్లే సాధ్యం
టీఆర్ఎస్ ను ఓడించడం బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని భావించి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బీజేపీపై నమ్మకంతోనే ఆ పార్టీలో చేరానని చెప్పారు. తన రాజీనామాతో మునుగోడులో రాజకీయం సునామీ తరహాలో వచ్చిందని అన్నారు. మునుగోడు ఓటమితోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుందని తెలిపారు. కాళేశ్వరం అవినీతి సొమ్ముతో మునుగోడు ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కే పరిమితమైందని అన్నారు. మునుగోడుకు నిధులివ్వాలని అసెంబ్లీలో అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదన్నారు. ప్రజలిచ్చిన పదవిలో ఉండి, వారి కోసం పని చేయలేకపోతున్నాననే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి చెప్పారు.


బీజేపీలోకి పలువురు స్థానిక నేతలు
బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త ఏరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కడగంచి రమేశ్‌, భిక్షం, కాయితి రమేశ్‌, వెంకటేశం, సుధాకర్‌రెడ్డి, మొగుదాల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్‌ జడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఉప్పు భద్రయ్య, పురపాలిక కౌన్సిలర్లు ఉబ్బు వరమ్మ, పోలోజు వనజ, సందగళ్ల విజయ, కొయ్యడ సైదులు, ఎంపీటీసీ సభ్యులు జెల్ల ఈశ్వరమ్మ, బద్దం కొండల్‌రెడ్డి, దోసపాటి జ్యోతి, సురుగు రాజమ్మ, మందుల శ్రీశైలం, సర్పంచి గుడ్డేటి యాదయ్య, పలువురు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. వారికి రాజగోపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.