Rajanna Siricilla News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అత్యుత్సాహం చూపించింది. ఫీజు కట్టని వాళ్లను బస్సు కూడా ఎక్కనివ్వద్దని డ్రైవర్లకు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ డ్రైవర్ బాలిక ఫీజు కట్టలేదని బస్సులోంచి దింపేశారు. 


అసలేం జరిగిందంటే..?


రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం పద్మనగర్ కు చెందిన ఓ విద్యార్థిని ఇంటి దగ్గర నుంచి శుభోదయం స్కూల్ కు సంబంధించిన బస్సులో ఎక్కించుకున్నారు. కానీ మార్గమధ్యంలో ఫీజు కట్టలేదని తెలిసి మధ్యలోనే దింపేశాడు డ్రైవర్. దీంతో ఏం చేయాలో పాలుపోని చిన్నారి అక్కడే నిలబడిపోయింది. బాలిక ఒక్కతే అక్కడ ఉండడంతో.. అటువైపుగా వెళ్తున్న వాళ్లంతా బాలికను ఏమైందని ప్రశ్నించారు. జరిగిన విషయం చెప్పగా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు వచ్చి పాపను ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై అటు తల్లిదండ్రులతో పాటు ఇటు స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఫీజు కట్టలేదని పిల్లల్ని నడిరోడ్డుపై దింపేయడం ఏంటంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఫీజులు కట్టమని తల్లిదండ్రులకు ఫోన్ లు చేసిన చెప్పాలే కానీ.. ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇదే విషయమై డ్రైవర్లను ప్రశ్నిస్తుంటే... ఫీజు కట్టని పిల్లలను బస్సుల్లో ఎక్కనివ్వకూడదని యాజమాన్యం చెప్పారని, అందుకే తాము ఎక్కించుకోవడం లేదని, ఒకవేళ పిల్లలు ఎక్కినా తాము దింపేస్తున్నట్లు తెగేసి చెబుతున్నారు. 


ఇటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలోనే ఇలా జరగడం దారుణం అని పలువురు అంటున్నారు. ఇదే విషయం మంత్రి కేటీఆర్ కు తెలిస్తే.. బాగుంటుందని భావిస్తున్నారు. ఆయనకు తెలిసేలా చేస్తే.. తమ సమస్యలు తీరుతాయని.. శుభోదయం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటున్నారు.