నేతన్నల కళా నైపుణ్యానికి తిరుగులేదని మరోసారి రుజువైంది. అగ్గిపెట్టెలో పట్టేచీర ఎప్పుడో ప్రాచుర్యం పొందింది. దబ్బణంలో పట్టే చీరలు నేసిన నైపుణ్యమూ వారి సొంతం. ఉంగరంలో దూరే చీరను నేసిన ఘనత కూడా వారిదే. ఇప్పుడు మరో అద్భుతం చేసి చూపించాడు సిరిసిల్ల నేతకారుడు హరిప్రసాద్. 


పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు హరిప్రసాద్‌. సొంతూరు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ తల్లికి ఏదో ఒక కానుక ఇవ్వాలని అతని మనసులో ఎప్పటి నుంచో వుంది. రెగ్యులర్‌గా అందరిలాగా చీర నేస్తే ఏముంది అనుకున్నాడు. చీరకు వెండివెలుగులను, పట్టు సొబగులను అద్దాలని అకున్నాడు. ఆ ఆలోచనల్లోంచి వెండి పట్టుపోగుల చీర ప్రాణం పోసుకుంది.


గతంలో చేనేత మగ్గంపై ఎన్నో ఆవిష్కరణలు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఈ యువకుడు.. ఇప్పడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. చేనేత మగ్గంపై 20 రోజులపాటు శ్రమించి వెండి పట్టు పోగులతో పీతాంబరం నేశాడు.  750 గ్రాముల బరువున్న ఈ పీతాంబరం చీరను 150 గ్రాముల వెండి పోగులు, పట్టుదారంతో రూపొందించాడు.


ఇరవై రోజుల పాటు నిద్రాహారాలు మాని నేసిన ఈ చీరను భద్రాద్రి సీతమ్మవారికి ప్రభుత్వం తరపున సమర్పించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. హరిప్రసాద్‌ వినతిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు ఈ మేరకు హరిప్రసాద్‌ తాను స్వయంగా నేసిన చీరను అధికారులకు అప్పగించాడు.  


రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి భద్రాద్రి సీతమ్మవారికి తాను నేసిన పట్టు చీర అందించడం చాలా సంతోషంగా ఉందని హరిప్రసాద్‌ తెలిపారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి అందుకు తగిన ఏర్పాట్లు చేయించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌ ఈ చీర నేయడం పట్ల తోటి నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


ఇటీవలే వెల్ది హరిప్రసాద్​ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్శించారు. జీ20 సదస్సు లోగోను కాటన్ బట్టపై నేసి ప్రధానికి కానుకగా పంపాడు. ఆ గిఫ్ట్  గురించి మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. హరిప్రసాద్ టాలెంటుకి ముగ్దుడయ్యానని మోదీ చెప్పుకొచ్చారు. ఆయన పంపిన బహుమతి అద్భుతంగా ఉందని ప్రశంసించారు. లోగో చూసి ఆశ్చర్యపోయానని, హరిప్రసాద్ పనితనం అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జీ-20 లాంటి సదస్సుకి కనెక్టయ్యాడంటే,చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు.


ఇదే జిల్లాకు చెందిన మరో చేనేత కళాకారుడు నల్లా విజయ్ సువాసనలు వెదజల్లే ఒక వెండి చీరను తయారు చేశాడు. 27రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి చీరను నేశాడు. ఆ చీరకు సిరిచందన పట్టుగా నామకరణం చేశారు. 90 గ్రాముల వెండితో పోగులు, 27 రకాల పరిమళాలతో కూడిన నూలుపోగులతో కలిపి పట్టుచీరను నేశాడు. 600 గ్రాముల బరువుండే ఈ చీర 48 ఇంచుల వెడల్పుతో ఐదున్నర మీటర్ల పొడవుతో కట్టుకోడానికి వీలుగా వుంటుంది. ఈ చీరను తయారు చేయడానికి రూ.45 వేలు ఖర్చయినట్లు నల్ల విజయ్‌కుమార్‌ తెలిపారు.