Indore News: శ్రీరామనవమి రోజున ఇండోర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్ శ్రీ బెలేశ్వర్ మహదేవ్ జులేలాల్ ఆలయం నేల కుంగిపోవడంతో 25 మందికిపైగా బావిలో పడిపోయారు. బావిలో పడిన వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 12 మంది మృతదేహాలను వెలికితీశారు. నవమి సందర్భంగా ఆలయం వద్ద భారీగా భక్తులు గుమిగూడారు. పురాతనం ఆలయం వద్ద ఉన్న బావి పైకప్పుపై భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రమాదం జరిగింది. అంతమంది భారంతో పైకప్పు కుప్పకూలింది. 






ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, 108 వాహనాలు చాలా సేపటి వరకు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. కొందరిని వీలైనంత వరకు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. తాజాగా ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. వారి మృతదేహాలను మెట్లబావి నుంచి వెలికితీశారు. అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉంది. 
 
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన జేసీబీ లోపలికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బావ్డీ నుంచి ఏడుగురిని రక్షించారు. బావిలో మరో 7 మంది సురక్షితంగా ఉన్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. మిగిలిన వారిని రక్షించేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు.






పటేల్ నగర్ లోని ఆలయంలో విషాదం చోటు చేసుకున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నవమి సందర్భంగా ఆలయంలోని పురాతన బావి పైకప్పుపై భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారని, బలహీనంగా ఉన్న పైకప్పు మోయలేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


ఇండోర్‌కు చెందిన బీజేపీ ఎంపీ శంకర్ లల్వానీ ఏబీపీ న్యూస్ తో మాట్లాడుతూ,'ప్రమాద స్థలంలో అధికారులు ఉన్నారని చిక్కుకున్న వారిని బయటకు తీయడమే మా ప్రాధాన్యత. ఆ ఆలయం చాలా పురాతనమైనదని నాకు తెలుసు. బావి చాలా పాతదన్నది వాస్తవమే కానీ ప్రమాదానికి కారణమేమిటో చెప్పడం కష్టం. తదుపరి దర్యాప్తు జరుగుతుంది, కానీ ప్రస్తుతం భక్తులను రక్షించడం ప్రాధాన్యత. ఇప్పటి వరకు ఆరుగురిని రక్షించి మీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.






విపత్తు నిర్వహణ నిపుణురాలు అంజలి క్వాత్రా మాట్లాడుతూ, "యంత్రాంగం వేగంగా స్పందించింది, ఇది మంచి విషయం. కానీ మతపరమైన ప్రదేశాల్లో ప్రతిసారీ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయనేది పెద్ద ప్రశ్న. ముందుగానే ఎందుకు ప్రిపేర్ కాకూడదు? ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా ఇరుకైన ప్రాంతం అయినప్పటికీ అధికార యంత్రాంగం చాలా చరుగ్గా స్పందిస్తోంది స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.


సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. తామంతా పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యామన్నారు. నేను నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు 10 మందిని రక్షించారు. ఇంకా కొంత మంది లోపలే ఉన్నారు. నేను మీకు 19 మంది గురించి సమాచారం ఇచ్చాను, మేము లోపల చిక్కుకున్న వారందరినీ రక్షించగలము.