Virat Kohli:
ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ విద్యార్థులకు ఓ సందేశం ఇస్తున్నాడు! పాఠశాలల్లో ప్రాముఖ్యం ఇవ్వని ఓ సబ్జెక్టే ఇప్పుడు తన క్యారెక్టర్‌ను బిల్డ్ చేసిందని అంటున్నాడు. మార్కుల గురించి ఎక్కువగా పట్టించుకోవద్దని పరోక్షంగా చెబుతున్నాడు. నమ్మిన రంగంలో కష్టపడితే జీవితంలో ఎదగొచ్చని సూచిస్తున్నాడు. తన పదో తరగతి మార్కుల మెమోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
హిందీ, ఇంగ్లిష్, మాథ్స్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో డిస్టింక్షన్‌లో పాసయ్యానని విరాట్ చెబుతున్నాడు. తన మూర్తిమత్వాన్ని సూచిస్తున్న 'ఆటలు' అందులో లేవని పేర్కొన్నాడు. దేశంలో బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిన పదో తరగతిలో స్పోర్ట్స్ లేవని అంటున్నాడు. ఇక మార్కుల విషయానికి వస్తే ఇంగ్లిష్‌లో 83, హిందీలో 75, లెక్కల్లో 51, సైన్స్‌లో 55, సోషల్‌లో 74 తెచ్చుకున్నాడు. 'మీ మార్కుల షీట్లలో ప్రాధాన్యమే ఇవ్వని విషయాలే మీ క్యారెక్టర్ బిల్డ్ చేయడంలో ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకోవడం ఫన్నీగా అనిపిస్తుంది. #LetThereBeSport' అని పోస్టు పెట్టాడు. త్వరలోనే దేశ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలవుతుండటంతో విరాట్ దీనిని పంచుకున్నాడు.
క్రికెట్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఎలాగైనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీలు కొట్టడంతో తిరిగి ఆత్మవిశ్వాసం సాధించాడు. తన మునుపటి రేంజులో ఆడుతున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్‌కు అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు 223 మ్యాచులు ఆడి 6624 పరుగులు చేశాడు. 36.20 సగటు, 130 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు. 32 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 44 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు బాదేశాడు. 578 బౌండరీలు, 218 సిక్సర్లు కొట్టాడు.
ఈ సీజన్‌లో మూడో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జాయింట్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జాయింట్‌ల మధ్య ఏప్రిల్ 10వ తేదీన చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి స్క్వాడ్
వికెట్ కీపర్లు: అనుజ్ రావత్, దినేష్ కార్తీక్.
బ్యాటర్లు: ఫాఫ్ డు ప్లెసిస్ (SA), ఫిన్ అలెన్ (NZ), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్ (ENG).
ఆల్ రౌండర్లు: వనిందు హసరంగా (SL), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్ (AUS), షాబాజ్ అహ్మద్, సోను యాదవ్, మనోజ్ భాండాగే.
బౌలర్లు: ఆకాశ్ దీప్, జోష్ హేజిల్‌వుడ్ (AUS), సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ (ENG), అవినాష్ సింగ్, రాజన్ కుమార్, రీస్ టోప్లీ (ENG), హిమాన్షు శర్మ.