Steve Smith on Dhoni:


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఎంఎస్‌ ధోనీ తన కెప్టెన్సీలో ఆడేందుకు అంగీకరించడం ఆశ్చర్యపరిచిందని స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. 2017 సీజన్లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తున్నప్పుడు అతడెంతో సహాయం చేశాడని పేర్కొన్నాడు. అతడిలాగే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించానని వెల్లడించాడు. ఐపీఎల్‌ 2023 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడాడు. ఈ సారి వేలంలో అతడిని ఎవరూ తీసుకోలేదు. దాంతో కామెంటేటర్‌గా అరంగేట్రం చేస్తున్నాడు.


'రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉండమన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. ఎంఎస్ ధోనీతో ఎలా ప్రవర్తించాలో అర్థమవ్వలేదు. కానీ ఆ సీజన్లో అతడు అద్భుతం! నాకు అవసరమైన ప్రతిసారీ సాయం చేశాడు. మొదట్లో ఏం ఆశించాలో తెలియలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆడిన ప్రతిసీజన్లో అతడు కెప్టెన్‌గానే ఉన్నాడు. చెన్నైని తిరుగులేని విధంగా నడిపించాడని ప్రత్యేకంగా చెప్పాలా' అని స్మిత్‌ అన్నాడు.


'ఆర్పీఎస్‌ యాజమాన్యం నన్ను అడిగినప్పుడు షాకయ్యాను. అప్పుడేం చెప్పాలో అర్థమవ్వలేదు. దీని గురించి ధోనీకి చెప్పారా అని అడగాలనిపించింది. నా వైపు నుంచి వింతగానే ఉంది. సమస్యలన్నీ పరిష్కరించుకున్నాక మహేంద్ర సింగ్‌ అద్భుతంగా అనిపించాడు. అతడు నాకూ, జట్టుకూ సహాయం చేసిన తీరు మర్చిపోలేను. అతడికి కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. ఆలోచనల కోసం ప్రతిసారీ అతడి దగ్గరికే వెళ్లేవాడిని. అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. అతడి కెరీర్లో మొత్తం ఇదే గమనించాం. ఏదో రకంగా అతడిలా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాను' అని స్మిత్‌ చెప్పుకొచ్చాడు.


ఐపీఎల్‌ చరిత్రలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ఎంఎస్ ధోనీ ఆ ఫ్రాంచైజీని అద్భుతంగా నడిపించాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో 2016, 17లో సీఎస్‌కే నిషేధానికి గురైంది. దాంతో ఆ రెండేళ్లు ధోనీ, జడ్డూ రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు ఆడారు. 2016లో కెప్టెన్‌గా మహీ కెప్టెన్‌గా విఫలమయ్యాడు. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిపాడు. ఆ తర్వాతి ఏడాది అతడిని కాదని యాజమాన్యం స్మిత్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.


మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) మార్చి 31వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో ఏప్రిల్ 3వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ ముందు తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లోని మూడో మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ జట్టు రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.