Rajanna Siricilla News: జమ్ముకశ్మీర్ లోని కిశ్త్ వాఝ్ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చనిపోయిన ఆర్మీ జవాన్ అనిల్ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కాపూర్ లో ఆయన అంత్యక్రియలను సైనిక లైంఛనాల మధ్య నిర్వహించారు. అయితే జవాన్ అంతిమ యాత్రంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పాల్గొన్నారు. పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వీరే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరయ్యారు. మల్కాపూర్ కు భౌతిక కాయాన్ని తీసుకొస్తుండగా.... గంగాధర వద్ద ఆయనకు ప్రజలు నివాళులు అర్పించారు. గంగాధర నుంచి మల్కాపూర్ కు భారీ జనసందోహం మధ్య అంతిమయాత్ర కొనసాగింది. 






గురువారం రోజు నదిలో పడిపోయిన ఆర్మీ ఏఎల్ హెచ్ ధ్రువ్ హెలికాప్టర్


రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన పబ్బాల అనిల్ అనే ఆర్మీ జవాన్ జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గురువారం రోజు మృతి చెందారు. అనిల్ గత 11 ఏళ్లుగా ఆర్మీలో పని చేస్తుండగా.. గురువారం జమ్ము కశ్మీర్ వద్ద సిగ్నల్ సమస్యల వలన అనిల్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న "ఆర్మీ ఏఎల్ హెచ్ ధ్రువ్" హెలికాప్టర్ నదిలో పడిపోయింది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు.. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఆ ప్రమాదంలో అనిల్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఆర్మీ జవాన్ అనిల్ కు భార్య  సౌజన్య, ఇద్దరు కుమారులు అయాన్, ఆరవ్, తల్లి తండ్రులు మల్లయ్య, లక్ష్మి, ఇద్దరు సోదరులు శ్రీనివాస్, మహేందర్ ఉన్నారు.






అనిల్ కుమార్ 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. కుటుంబ సభ్యులతో పాటు ఊరి వారితో కూడా చాలా సరదాగా గడిపాడు. ఆ మధ్యే విధుల్లో చేరిన ఆయన కొన్ని రోజులకే మృతి చెందాడు. అనిల్ మృతి వార్త విన్న కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనిల్‌ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.