Top Headlines Today: 


నేడు ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు రిజల్ట్స్‌ను రిలీజ్ చేస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలో ఫలితాలను చూడొచ్చు. గత కొన్ని రోజులుగా పదో తరగతి ఫలితాలపై రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఇది ఇవాళే పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. కానీ ప్రభుత్వాధికారులు వాటికి వివరణ ఇస్తూ వస్తున్నారు. చివరకు తీవ్ర తర్జనభర్జనల మధ్య ఫలితాలను శనివారం ఉదయం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 


మహబూబ్‌నగర్‌లో కేటీఆర్‌ టూర్


తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇవాళ మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీకారిడార్‌కు ప్రారంభిస్తారు. అక్కడే వివిధ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుంటారు. వాటికి స్థలాన్ని కేటాయిస్తారు. అనంతరం అమరరాజ లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రానికి జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. 


ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న చంద్రబాబు టూర్
ఉభయగోదావరి జిల్లాల్లో అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఇవాళ కూడా కొనసాగనుంది. నిన్న కొన్ని గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దెబ్బ తిన్న పంటను 72 గంటల్లో కొనాలంటూ గడువు పెట్టారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటను ఈ ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఒక్క గోదావరి జిల్లాల్లో 40 నుంచి 50 శాతం పంట ఇప్పటికీ పొలాలు, కళ్లాల్లో ఉండిపోయిందని అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఏం చేస్తాడో ఈ సీఎం జగన్ చెప్పాలన్నారు. గతంలో పంటలకు ప్రభుత్వం  ఇన్సూరెన్స్ చేసేదని, రాష్ట్ర ప్రభుత్వం, రైతు, కేంద్రం కలిసి ఇన్సూరెన్స్ కట్టేవారన్నారు.


ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్  తీసేశారని, నాడు అసెంబ్లీలో ఇలాగే ఇన్సూరెన్స్  కట్టకుండా కట్టాను అని చెప్పాడన్నారు. నాడు అసెంబ్లీలో పోడియం వద్ద కూర్చుని నిరసన చేస్తే అప్పుడు రాత్రికి రాత్రి డబ్బు కట్టాడని గుర్తు చేశారు. ఇన్సూరెన్స్  కట్టి ఉంటే వారికి నేడు కాస్త భరోసా లభించేదని,- ఒక ఎకరానికి 50 నుంచి 60 బస్తాల ధాన్యం వస్తుండగా కౌలు రైతు 30 బస్తాలు కౌలుగా చెల్లిస్తున్నాడన్నారు. ఖరీఫ్ లోను దెబ్బతిన్నారు, ఇప్పుడు అకాల వర్షాలకుమళ్లీ దెబ్బతిన్నారని చంద్రబాబు అన్నారు.


నేడు బెంగళూరులో మోదీ రోడ్‌ షో
కర్ణాట ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో రోడ్‌షో నిర్వహించనున్నారు. సుమారు పాతిక కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో సాగనుంది. అనంతరం బడమి, హవేరీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కూడా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పార్టీ ప్రచారంలో పాల్గొంటారు. బెల్గావి, హుబ్లీలో రాహుల్‌తో కలిసి ప్రచారం చేయనున్నారు సోనియా 


ఐపీఎల్‌లో నేడు


నేడు ఐపిఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 3.30 గంటలకు చెన్నై, ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం రాత్రి 7.30 గంటలకు బెంగళూరు, ఢిల్లీ మధ్య మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. 


నేడు బ్రిటన్ రాజుగా చార్లెస్‌ 3 కి పట్టాభిషేకం 


నేడు బ్రిటన్ రాజుగా చార్లెస్‌ 3 పట్టాభిషేకం లండన్‌లోని చారిత్రక వెస్‌మినిస్టర్‌ అబేలో వైభవంగా జరగనుంది. 1953 తర్వాత జరుగుతున్న పట్టాభిషేకం కావడం అందరి దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. 1953లో క్వీన్ ఎలిజబెత్‌కు నాడు పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. భారత్‌ నుంచి ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ పాల్గొంటున్నారు.