ఓ వైపు సహజ ఇంధనాల ధరలు విపరీతంగా పెరగడం, మరోవైపు దేశంలో సోలార్ ఎనర్జీకి ఉజ్వల భవిష్యత్తు ఉండడంతో అధికారులు ఆ వైపుగా దృష్టి సారించారు. ఈ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుండడంతో వీటిని స్థాపించడానికి ప్రోత్సాహకాలను సైతం అందిస్తున్నారు. ఇప్పటికే నదీ జలాలపై తేలియాడే సౌర ఫలకాల ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా పలు గ్రామాల్లో గృహోపకరణాల విషయంలో పెరుగుతున్న విద్యుత్ బిల్లుల తగ్గింపు సహా ఇతరత్రా ఇబ్బందులను అధిగమించేందుకు అవసరమైన చర్యల్ని నాలుగు జిల్లాల పరిధిలో అధికారులు తీసుకుంటున్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా ఆచరణలో విజయవంతమయ్యేలా ప్రక్రియని మారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చొరవతో ఇంధన పొదుపునకు బాట పడుతున్నాయి.
125 గ్రామాల్లో పూర్తయిన సర్వేలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో సౌరశక్తి ద్వారానే ఉండాలనేలా ఈ జిల్లాను ఇటీవలే ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. ప్రతి నెలా వేల రూపాయల బిల్లులు విద్యుత్ చెల్లింపునకు వెచ్చిస్తున్న పంచాయతీలో బాధలను తొలగించి వీధి దీపాల విషయంలో విప్లవానికి సిరిసిల్ల కేంద్రంగా మారనుంది. హనుమకొండ, మేడ్చల్- మల్కాజీగిరి, నారాయణపేట, సంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలతోపాటు సిరిసిల్లకు అవకాశం లభించడంతో ఇటీవలే గ్రామాల్లో అధికారులు సర్వే పూర్తి చేశారు. 225 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటి వరకు 125 ఊళ్లలో సర్వే పూర్తయింది. ఎక్కడెక్కడ ఏ తరహా దీపాలు అవసరమనేది నిర్ధారించి ఎంపిక చేస్తారు. సురక్షితమైన యాంగ్లర్లు, కేబుల్ అమరికలతో వీటిని అనుసంధానిస్తారు.
కరీంనగర్ లో 15 చోట్ల ఈవీ మోటార్ ఛార్జింగ్ స్టేషన్లు..
25 నుంచి 30 బల్బులకు ఒక సెంట్రల్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈఈఎస్ఎల్ సర్వీస్ కు అప్పగిస్తారు. కొన్నాళ్ళ వరకు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పంచాయతీల నుంచి వారికి నిర్వహణ ఫీజులు చెల్లిస్తారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి సిరిసిల్ల జిల్లాలోని ప్రతిపల్లె సౌర దీపాలు వెలుగుతూ మెరిసిపోయే విధంగా ప్రక్రియలో పనులను వేగవంతం చేస్తున్నార్తు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో త్వరలో 15 చోట్ల ఈవీ మోటార్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కరీంనగర్ లో 15 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. కనీసం 500 గజాల నుంచి అరెకరం స్థలం వరకున్న ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు రూపంలో అందించారు.
కలెక్టర్ ఆమోదం వస్తే.. అందుబాటులోకి!
కలెక్టర్ ఆమోదం పొందితే ఒక స్టేషన్ కు 35 లక్షల నుంచి 45 లక్షలు వెచ్చించి వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు కరీంనగర్ జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు జాతీయ రహదారితోపాటు, రాజీవ్ రహదారి ఇతర మార్గాల్లో వీటిని నెలకొల్పాలని చూస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని ఏర్పాటు చేసుకుంటామంటే అనుమతులు ఇవ్వడానికి అధికారులు కూడా సరే అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నగరంలో ఎలక్ట్రిక్ బైకులను వాడుతున్నారు. కొన్ని ఎలక్ర్టిక్ కార్లు కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ కేంద్రాలు ఎక్కువగా ఉంటే వాహనాల సంఖ్య మరింతగా పెరిగే వీలుంటుంది.