కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్‌లో చేరిన హుజూరాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి పార్టీలో అయోమయ స్థితిలో ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ నుంచి మొదట టికెట్ ఆశించి అనివార్య పరిస్థితుల్లో పొందలేకపోయిన ఆయన భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఈటల రాజేందర్‌తో తలపడ్డారు. పెద్ద ఎత్తున ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు.
Also Read: హుజూరాబాద్ లో దళితబంధుకు బ్రేక్.. ఈసీ కీలక ఆదేశాలు
ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైన సమయంలో కాంగ్రెస్‌లో ఉంటూనే వ్యక్తిగతంగా కేటీఆర్‌ని కలిసి పలు అంచనాలకు తెరతీశారు. కొద్దిరోజుల్లోనే కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారని సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ఖాయం అయ్యేసరికి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ వెళ్లి మరీ పార్టీలో అట్టహాసంగా చేరిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావించి సదరు ఫైలును గవర్నర్‌కు పంపారు. ఇది జరిగి 3 నెలలు అవుతుంది. కానీ, ఇప్పటిదాకా పలు కారణాలతో గవర్నర్ ఆ ఫైల్‌ని కదిలించలేదు. మూడు నెలలుగా పెండింగ్‌లోనే ఉన్న ఫైలుతో అసలు ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందా అనేది సందేహంగా మారింది.
Also Read: రూ.1.7 లక్షల కోట్లతో రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తాం.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రచార సభలలో పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ రాదని, టీఆర్ఎస్ నాయకులు కౌశిక్‌ని వాడుకొని వదిలేస్తారని విపక్ష నాయకులు అంటుండడం దుమారం రేపుతోంది. ఇది అంతిమంగా టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఒక పక్కా నిర్ణయం తీసుకొని కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న ఈ ఫైల్‌ని ఏ రకంగా పరిష్కరించాలో చర్చించి హైకోర్టుకు వెళ్లడం ద్వారా.. ఫైలు కదిలే అవకాశం ఉంటుందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్ఠానం న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: YS Sharmila : వైఎస్ కుటుంబం నుంచి మరో "ప్రజాప్రస్థానం" - పాదయాత్రకు షర్మిల రెడీ !