కరీంనగర్‌లో జరిగిన ఓ చోరీ ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది. దొంగతనం కేసులో విచారణ జరిపిన పోలీసులకు కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు తెలిశాయి. ఎంతటి పక్కా సమాచారంతో ఎంతో కాలంగా మాటు వేసి దొంగతనం చేశాడో తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ నేరం చేసినది కన్న కొడుకే అని పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనం కోసం నిందితుడు వాడిన సాంకేతికత అవాక్కయ్యేలా చేస్తోంది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన వైకుంఠం అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మొదటి, మూడో కొడుకులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో కొడుకు కరీంనగర్‌లోనే వేరుగా ఉంటున్నాడు. స్థిరాస్తులకు సంబంధించిన వైకుంఠానికి కొడుకులతో తరచూ గొడవలు ఉండేవి. ఇవి వివాదంగా మారడంతో తండ్రి వద్ద ఉన్న సొత్తును కాజేయాలని రెండో కొడుకు కుట్ర పన్నాడు. దీనికి అతడి భార్య కూడా సహకరించింది. వైకుంఠం ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? అనేవి మొత్తం తెలుసుకొనేందుకు రెండో కొడుకు ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అనే యాప్‌ను తండ్రి ఫోన్‌లో ఆయనకు తెలియకుండానే ఇన్‌స్టాల్ చేశాడు.
Also Read: Hyderabad: తల్లిపైనే నీచానికి పాల్పడిన కన్న కూతురు.. ప్రియుడి సాయం తీసుకొని దారుణం
ఈ యాప్ సాయంతో తండ్రి మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ మొత్తం ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా రెండో కొడుక్కి వస్తుండేవి. ఇలా తన ఈ-మెయిల్‌కి వస్తున్న ప్రతి కాల్‌ను రెండో కుమారుడు వినేవాడు. వైకుంఠం ఇటీవల హైదరాబాద్‌లోని మొదటి, రెండో కొడుకుల వద్దకు రావాలని భావించి.. ఈ విషయం వారికి ఫోన్‌లో చెప్పారు. వాళ్లు ఇంటికి తాళాలు సరిగ్గా వేయాలని, వాటిని భద్రంగా ఉంచుకోవాలని సూచించగా.. వైకుంఠం ఆ తాళాలను ఫలానా రహస్య ప్రాంతంలో దాచి వస్తానంటూ చెప్పేశాడు.
Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్
ఈ సంభాషణ మొత్తం ఆటోమేటిక్ కాల్ రికార్డర్ యాప్ ద్వారా రికార్డు కావడంతో పాటు రెండో కుమారుడు మొత్తం విన్నాడు. అలా విషయం తెలుసుకున్న రెండో కొడుకు భార్యతో కలిసి తండ్రి ఇంటికి వెళ్లాడు. రహస్య ప్రాంతం నుంచి తాళాలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తెరిచి అందులోని రూ.25 లక్షల విలువైన నగదు, నగలు కాజేశారు. ఆపై యథావిధిగా తాళాలు వేసి ఆ రహస్య ప్రాంతంలోనే పెట్టేశారు. భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన వైకుంఠం కొన్ని రోజులకు కరీంనగర్ తిరిగి వెళ్లారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా.. బీరువాలో ఉండాల్సిన డబ్బు, బంగారం మొత్తం మాయమై ఉంది. ఆస్తి పత్రాలు కూడా కనిపించలేదు.
Also Read: Nellore Crime: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!
విషయం పోలీసులకు చెప్పడంతో వారు విచారణ జరిపారు. తన ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను నిశితంగా గమనించగా.. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ యాప్ ఉండటాన్ని గుర్తించారు. దాన్ని తెరిచి అధ్యయనం చేయగా.. రెండో కుమారుడి ఈ– మెయిల్ ఐడీతో సింక్ అయి ఉన్నట్లు గుర్తించారు. తన సంభాషణలు విన్న రెండో కుమారుడే ఈ దొంగతనం చేసి ఉంటాడని నిర్ధారించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : ఆర్కేకు లాల్ సలాం ! అంత్యక్రియల ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు !