తెలంగాణ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి ప‌క్షాల‌కు ప‌నిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తీవ్రస్థాయిలో ధ్వజ‌మెత్తారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో సోమవారం పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ప్రజలకు ఇళ్లు అందిస్తున్నామని, అర్హులైన వారందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని అన్నారు. అతి త్వరలోనే అందరికీ ఇవి అందజేస్తామని వెల్లడించారు.


కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.8,500 కోట్లు కేటాయించామని కేటీఆర్ గుర్తు చేశారు. ముస్తాబాద్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికి డ‌బుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామ‌ని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాట ఇస్తే నిల‌బెట్టుకుంటుందని చెప్పారు. గ‌త ప్రభుత్వాల హ‌యాంలో ఒక ఇంటి నిర్మాణం కోసం ముప్పుతిప్పలు పెట్టేవారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత పేద‌లుఆత్మగౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టించి ఇస్తున్నామని అన్నారు.


ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రైవేటు బిల్డర్ క‌డితే రూ.20 నుంచి రూ.25 ల‌క్షల ఖ‌ర్చు అయ్యేదని అన్నారు. రాజ‌కీయాల‌కు తావు లేకుండా అర్హులైన వారికి కాంట్రాక్టులు కేటాయిస్తున్నమని వివరించారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ మొండి మ‌నిషి అని.. ఆయ‌న ఏ ప‌ని చేప‌ట్టినా పూర్తయ్యేదాకా వ‌ద‌ల‌బోరని అన్నారు. కాబ‌ట్టి ప్రతీ పేద వ్యక్తికి డ‌బుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని కేటీరఆర్ చెప్పారు.