ఎన్నికల వేళ ఒక పార్టీని దిగజార్చేలా మరో పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. సిరిసిల్లలో ఓడిపోతామని కేటీఆర్‌కు భయం చుట్టుకుందని, ఈ ఫోన్ కాల్ లో కేటీఆర్ క్యాడర్ ను బతిమాలుకుంటున్నారని కాంగ్రెస్ ఓ పోస్టు చేసింది. ఆ ఆడియో కాల్ రికార్డింగ్ ను కూడా ఎక్స్‌లో పోస్టు చేసింది. 


మూడోసారి కూడా తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, గెలుపు కోసం కాంగ్రెస్‌ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ ను లీక్‌ చేసింది. కేటీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం సిరిసిల్లలో క్యాడర్ ప్రచారానికి వెళ్లాలంటేనే వెనకాడుతుందని, కేటీఆర్ ఓడిపోవడం ఖాయం అని కాంగ్రెస్ చెబుతోంది. అందుకే కేటీఆర్ ఫోన్లు చేసి మరీ బతిమాలుకునే పరిస్థితికి వచ్చారని అంటోంది. 


మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గంలోని క్యాడర్ కు ఓ ఆడియో సందేశం పంపినట్లుగా ఉంది. ఎన్నికలకు ఇంకో వారం రోజులే ఉందని, మళ్లీ వచ్చే మంగళవారానికి ప్రచారం ముగిసిపోతుందని అన్నారు. ఈ లోపు ప్రతి ఒక్క నేత ఇంటింటి ప్రచారం చేయాలని కోరారు. నియోజకవర్గంలో తాను ఓడిపోతానని మొన్న ఎవరో పేపర్లో రాశారని అవన్నీ పట్టించుకోవద్దని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ నేతల్లోనే పుకార్లు పుట్టించి ప్రచారం చేస్తున్నారని, అవన్నీ పట్టించుకోకుండా ప్రచారం చేయాలని పిలుపు ఇచ్చారు. సొంత పార్టీ నేతల్లో, కార్యకర్తల్లోనే పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటున్నారని, అవన్నీ బంద్‌ చేయాలని కోరారు. పైగా మెజార్టీ తగ్గబోతుందని మనోళ్లే ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఆ గాలి మాటలు నమ్మకుండా ప్రచారంపై ఫోకస్ చేయాలని మంత్రి కోరారు.