కరీంనగర్: ముఖ్యమంత్రి కుర్చీలో ఓ దొంగ కూర్చున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పేం లేదన్న కేటీఆర్, కెసిఆర్ (KCR) మీద ద్వేషం నింపి జనాల మనసు మార్చారన్నారు. కరీంనగర్ లో జరిగిన బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, తెలంగాణ ప్రజల బాగు కోసం బీఆర్ఎస్ మళ్లీ గెలవడం చారిత్రక అవసరం అన్నారు. ఏప్రిల్ 27న జరిగే వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చి బిఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్న సన్నాసుల నోళ్లు మూతలు పడేలా చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.


కేసీఆర్‌కు కరీంనగర్ సెంటిమెంట్


కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. కేసిఆర్ కి కరీంనగర్ సెంటిమెంట్. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతారు. బిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17 2001 నాడు ఇదే కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ మైదానంలో కేసీఆర్ గారు పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు.


రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడుంది తెలంగాణ అని అప్పటి పిసిసి అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందించి కేసీఆర్ రాజీనామా చేస్తే.. 2 లక్షల ఓట్లతో గెలిపించి కరీంనగర్ దమ్ము చూపించింది. అన్యాయం, వివక్ష, అక్రమాలను కరీంనగర్ గడ్డ సహించదు. ఎదురిస్తూనే ఉంటుంది. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ.. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో 15 నెలల నుంచి బిఆర్ఎస్ చూపిస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి వెనుకడుగు వేస్తే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన నాయకుడు కేసీఆర్.


భూమికి జానెడు లేని వాళ్ళు కూడా ఇవాళ కెసిఆర్ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. కాలం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసకొడతాయి. గ్రామ సింహాలు కూడా నిజమైన సినిమాల లెక్క గర్జిస్తాయి చూడాలి తప్పదు. బిజెపి కాంగ్రెస్ లు దొందు దొందే.. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులే. 15 లక్షలు జన్ ధన్ ఖాతాల్లో వేస్తామని మోడీ మాట ఇచ్చి మోసం చేసిండు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 11 సంవత్సరాల లో మోడీ చేసిందేమీ లేదు. 


తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్
1998 కాకినాడ తీర్మానం లో ఒక ఓటు రెండు  రాష్ట్రాలు అన్న బిజెపి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణలో ఏ ఊరికి పోయినా రైతు కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయి. కెసిఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కాంగ్రెస్ వచ్చినంక బతుకు ఆగమైందంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి.  రైతుబంధు పడక అన్నదాత ఆగం అవుతున్నాడు.రుణమాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులురిగేలా తిరుగుతున్నారు. రైతులకు కెసిఆర్ గుర్తుకొస్తున్నారు. 


కాంగ్రెస్ కు ఓటేస్తే రైతుబంధుకు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ముందే హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం, అణిచివేతల రాజ్యం. మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. బిఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా తిరిగి  రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.


కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్


రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కెసిఆర్ ని తలుచుకుంటున్నారు. 73% జీతం పెంచి మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ అని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఐదు డిఏలు కోల్పోయామని బాధపడుతున్నరు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మి మోసపోయాం, 15 నెలల్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని బాధపడుతున్నారు. తిరిగి ఎన్నికలు వస్తే సత్తా చూపించి గులాబీ జెండా మళ్లీ ఎగురవేయాలన్న కసి మీద రాష్ట్రమంతా ఉంది. ఏప్రిల్ 27 వరంగల్ సభకు లక్షలాదిగా తరలి రావాలి. బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మాట్లాడుతున్న సన్నాసుల నోళ్లు మూతలు పడేలా బహిరంగ సభను బంపర్ హిట్ చేద్దాం. 


భారత ప్రభుత్వం చెప్పినట్టు కుటుంబ నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ తో తీవ్ర అన్యాయం జరగబోతుంది. జనాభా తగ్గిన దగ్గర ఎంపీ సీట్లు తగ్గిస్తామని మోడీ అంటున్నాడు. ఉత్తరప్రదేశ్, బీహార్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో జనాభా ఎక్కువగా ఉంది అక్కడ ఎంపీ సీట్లు పెంచుతామని మోడీ మన మెడ మీద డీలిమిటేషన్ కత్తి పెట్టిండు. తెలంగాణకు మోదీ ఏం చేసిండో చెప్పమంటే బండి సంజయ్ ఏం చెప్పలేడు. 


ఒక బడి తేలేదు. ఒక గుడి కట్టలేదు. గుడికట్టినా…బడి కట్టినా..కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ తెచ్చినా.. కరీంనగర్ ను స్మార్ట్ సిటీ గా డెవలప్ చేసిన అది బీఆర్ఎస్ ఘనతే.. కాళేశ్వరం నీళ్లు తెచ్చి చివరి గ్రామాలకు కూడా సాగునీళ్ళు ఇచ్చినం..మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చినం. రివర్స్ పంపింగ్ తో కోరుట్ల, జగిత్యాల,చొప్పదండి నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చినం. ఎస్సారెస్పీ వరద కాలువను పూర్తిస్థాయి రిజర్వాయర్ గా మార్చిన ఘనత కేసీఆర్ ది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేసినం.



జగిత్యాల, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల ను జిల్లాగా చేసినం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ , ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టినం. 280 ఉన్న గురుకుల పాఠశాలను 1022 కు పెంచినం. ఒక్కో గురుకుల విద్యార్థి మీద సంవత్సరానికి 1,20,000  ఖర్చు చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. తెలంగాణ జనాల ఖాతాలో వేయకుండా ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖాతాల్లో టైం కు రేవంత్ రెడ్డి డబ్బులు వేస్తున్నాడు. అర చేతిలో వైకుంఠం చూసి తప్పుడు వ్యక్తులను ఎన్నుకుంటే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 


మోసపోతే గోస పడతామని కెసిఆర్ చెప్పిన మాటను జనాల్లోకి తీసుకపోవడంలో ఫెయిల్ అయినం. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో నంబర్వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ చెబుతుంది. దుర్మార్గుల చేతుల్లో ఆగమవుతున్న తెలంగాణను కాపాడాలంటే ఒక్క కేసీఆర్ గారి వల్లనే సాధ్యం. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారికి అధికారం మీద మోజులేదు.బిఆర్ఎస్ గెలవడం చారిత్రక అవసరం. తెలంగాణ ప్రజల బాగు కోసం కచ్చితంగా బిఆర్ఎస్ మళ్లీ గెలవాలి. ఏప్రిల్ 27 తర్వాత మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తాం. 


ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే లాభం లేదు
పార్టీని కాపాడే వాళ్లకే పెద్ద పీట వేస్తాం. ప్రజల్లో ఉండకుండా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే వాళ్లకు అవకాశం ఉండదు. బిజెపి కాంగ్రెస్ మోసాన్ని ఎండ కట్టాలి. తెలంగాణలోని అన్ని వర్గాలకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా చెప్పే సత్తా బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ఉండాలి. జిల్లా పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తలకు నాయకులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవడానికి మేమంతా కష్టపడతాం. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 కు13 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి. కెసిఆర్ టికెట్ ఎవరికీ ఇచ్చినా కార్యకర్తలు అంతా అతని గెలుపు కోసం కష్టపడాలి. క్యాండిడేట్ ఎవరైనా కొట్లాడేది కేసీఆర్ కోసమే. కెసిఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రతి ఒక్క కార్యకర్త శపథం చేయాలని’ కేటీఆర్ అన్నారు.