KTR in Parliamentary Election Preparation Meeting: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. తనను సిరిసిల్ల నుంచి ఐదో సారి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయిందని ఎవరు దిగులు పడొద్దని.. 100 స్పీడ్ తో 10 సంవత్సరాలు ప్రయాణం చేశామని అన్నారు. ఇప్పుడు కాస్త విరామం కోసం కార్ గ్యారేజ్ కు పోయింది. మళ్ళీ సత్తా చాటుదాం అని భరోసా కల్పించారు. ‘‘మనకు మంచే జరిగింది ఉన్న దిష్ఠి పోయి కేసీఆర్ విలువ ఎందో ప్రజలందరికీ తెలిసింది. కాళేశ్వరం దండగా అన్న కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతే రిపేర్ చేయకుండా కేసీఆర్ ను బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.


50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడన్నా నర్మాల ప్రాజెక్ట్ నీళ్లు నింపినారా.. నీళ్లు నింపిన ఘనత కేసీఆర్ దే. మనం ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. చేనేత కార్మికులను కడుపులో పెట్టుకొని ఉపాధి కల్పించినం. పదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎప్పుడన్నా ఒక్క మాటా అన్నమా. ఇప్పుడు అంటున్నాం సన్యాసులు, దౌర్భాగ్యులు అని. మా మీద కోపంతో నేతన్నలకు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇవ్వడం లేదు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మీద బురద జల్లెందుకు చూస్తున్నారు. డిసెంబర్ 9 అన్ని హామీలు నేరవేరుస్తా అని మాట ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి తప్పారు. మన ప్రభుత్వం కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. 


అధికార ఒత్తిడిలో నేను మీకు సమయం ఇవ్వలేక పోయాను ఇప్పటి నుండి మీ కష్ట, సుఖాల్లో నేను ఉంటాను. పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించుకుందాం. మన పార్టీ నుంచి వెళ్ళే వారు.. లేదా వెళ్ళేవారిని ఎవరు ఆపొద్దు, కొత్త నాయకత్వాన్ని ఏర్పర్చుకుందాం. గత ఐదేళ్ల కింద పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ఓడగొట్టికొని తప్పు చేసుకున్నాం మరోసారి అలాంటి తప్పు చేయద్దు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేయలేదు, మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప కరీంనగర్ కు ఈ సన్నాసి ఏం చేశారు.


తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అయోధ్య రామమందిర పేరు మీద రాజకీయం చేస్తూ ఓట్లు దండుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ కు సవాల్ చేస్తున్నా, కరీంనగర్ పార్లమెంటును బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో.. వినోద్ కుమార్ ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా.. చెప్పు ముస్తాబాడ్ వస్తావా.. కరీంనగర్ వస్తావా?’’ అని బండి సంజయ్ కు సవాలు విసిరారు.


‘‘ఎల్లుండి జిల్లా పోలీసు కార్యాలయం ఆఫీస్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వస్తున్నారు అవి కట్టింది మనమే కదా. 12 తేదీన పార్లమెంట్ ఎన్నికల "కదన భేరి" కరీంనగర్  నుండి భారీ భహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మీరంతా నా కుటుంబ సభ్యులు. ఎక్కడ పోగుట్టుకున్నమో అక్కడే గెలుచుకుందాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ అర్ ఎస్ పై ధర్నా చేయాలి. సిరిసిల్లలో రేపు ఎల్అర్ఎస్ పై ధర్నా విజయవంతం చేయాలి’’ అని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.