ఇప్పటివరకు శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, దీంతో మరింత ఉత్పాదకతను సాధించవచ్చని కనీస మద్దతు ధర కమిటీ (MSP) ప్రతినిధి భూపేంద్ర సింగ్ మాన్ అన్నారు. గురువారం కరీంనగర్లో కిసాన్ జాగరణ మంచ్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గుతుందని తెలిపారు. వ్యవసాయ ఎగుమతులు పెరుగుతున్నాయని.. స్వేచ్ఛ వాణిజ్యం వల్ల వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
అందులో భాగంగానే కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని కొన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మరో సభ్యుడు గుణవంత్ పాటిల్ మాట్లాడుతూ.. సాంప్రదాయ పంటల వల్ల రేట్లు తగ్గే అవకాశం ఉందని, అలాంటప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని వివరించారు. భువనేశ్వర్ లో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిందన్నారు. వరి, గోధుమ పంటలను మాత్రమే పండిస్తూ కొనుగోళ్లకు ప్రభుత్వంపై ఆధారపడటం వల్ల మద్దతు ధర సమస్య వస్తుందని అన్నారు.
మరో సభ్యుడు గుణి ప్రకాష్ మాట్లాడుతూ.. విజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించాలని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన మేళా కన్వీనర్ పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ రైతన్న లేకుంటే అన్నం లేదని అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. రైతులు పొలాలు అమ్ముకుంటుంటే రియల్టర్లు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్లలో రైతులను మోసం చేస్తున్న పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ఆధునిక పద్ధతులను రైతులకు వివరించాలనే ఉద్దేశంతో పాటు.. రైతు గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణలో మొదటిసారిగా మేళాను కరీంనగర్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కరీంనగర్ డైరీ ఛైర్మన్ రాజేశ్వరరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జలపతిరావు మాట్లాడుతూ పాడి పరిశ్రమ, సాగు పద్ధతులపై వివరించారు. వారి పత్తి మొక్కజొన్న ఇతర పంటలు విత్తనాలు సాగు విధానం పనిముట్లు యంత్రాలు అధిక దిగుబడి సాధించడానికి అవలంబించాల్సిన పద్ధతులపై శాస్త్రవేత్తలు, నిపుణులు, పొలాస వ్యవసాయ అధికారులు వివరించారు. కరీంనగర్ మార్కెట్లో కూరగాయలు అమ్మే మహిళలు మద్దతు ధర కమిటీ సభ్యులను పూలమాల, శాలువాతో సత్కరించారు.
తర్వాత విక్రయదారుల సంఘం బాధ్యులు లక్ష్మీని కమిటీ సభ్యులు, నిర్వహకులు సన్మానించారు. సభ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళా సందడిగా మారింది. ఇందులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పేరు గాంచిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మేళాకు ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. మేళాకు వచ్చిన వాళ్లంతా తిరుగుతూ స్టాళ్లను పరిశీలించడంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన యంత్రాలు, పనిముట్లు, వాహనాల పనితీరు ఎరువులు విత్తనాలు ఇతర అంశాలపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మేళాలో వివిధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో కొత్త యంత్రాలు, పనిముట్లు, డ్రోన్ లాంటివి ఉన్నాయి. వరి కోత, నాటు వేసే గడ్డిని కట్టలుగా కట్టే మొదలగు యంత్రాలను ప్రదర్శనలో ఉంచారు.