Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతినెలా వేలల్లో జీతాలు అందుకుంటూ.. వృత్తిపై నిబద్దతలేని కొందరు టీచర్లపై అదుపు తెచ్చేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు పకడ్బందీగా ప్లాన్ చేశారు. హాజరు విషయంలో అవకతవగలకు పాల్పడుతూ తమ ఇష్టం వచ్చినట్టుగా వివరణలు ఇస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు అంతా సిద్ధం చేశారు. సరైన సమయానికి విధులకు సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులను దారిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం చాలా మందిలో ఆందోళన రేపుతోంది. సొంత పనులు వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న ఉపాధ్యాయులతో పాటు, డిప్యూటేషన్ల పేరుతో కొనసాగుతున్న వారికి బయోమెట్రిక్ విధానం భయానికి గురి చేస్తుంది. 


ఆన్ డ్యూటీ, సర్దుబాట్ల పేరుతో డుమ్మాలు..


పాఠశాలకు ఇష్టం  వచ్చిన సమయాల్లో వెళ్లేవారు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల్లోని బడుల్లో పనిచేస్తూ జిల్లా కేంద్రాల్లో సొంత గ్రామాల్లో ఉండేవారు నిర్మిత సమయానికి విధులకు హాజరయ్యే వారిలో వణుకు మొదలైంది. ప్రభుత్వం డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేసిన జిల్లాల్లో అడ్డదారుల్లో పలుకుబడి డిప్యూటేషన్లు, ఆన్ డ్యూటీ లు కొనసాగుతూనే ఉన్నాయి. పక్క జిల్లాలో పనిచేస్తున్న వారు కూడా కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ డిప్యుటేషన్ల పై పని చేస్తున్నారు. అన్టిల్ ఫర్దర్ ఆర్డర్ అని డిప్యూటేషన్ ఉత్తర్వులలో జిల్లా విద్యాశాఖ పేర్కొనడం ఇలాంటి వారికి కలిసి వస్తోంది. ఆన్ డ్యూటీల పేరుతో పలువురు సర్దుబాటు పేరుతో మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు రంగం సిద్ధమవడంతో తమ పరిస్థితి ఏంటి అనే విషయంపై వారు ఆందోళన చెందుతున్నారు.


బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయులకు కళ్లెం..


ఇలాంటి వారు పనిచేస్తున్న పాఠశాలల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు చేయాల్సి ఉండడంతో పని చేస్తున్న బడులకు వెళ్లాల్సిందేనా అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించే పనిలో కొందరు ఉన్నట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయాల్లో వివిధ రకాల కార్యక్రమాల అమలుకు ఆన్ డ్యూటీ పై కొనసాగుతున్న కొందరు ఉపాధ్యాయులు.. స్కూళ్ల వైపు వెళ్లడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలోని 623 ప్రభుత్వ పాఠశాలబల్లో కొత్తగా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నారు. ఈ బడుల్లో ప్రస్తుతం 2,693 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలోని పాఠశాలల్లో అదనంగా ఉన్న 12 యంత్రాలను కరీంనగర్ కు తెప్పించారు. టెక్నీషియన్లు వాటిని అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.


ఈనెల రెండో వారం నుంచే అమలు..


మిగిలిన యంత్రాలను కూడా రెండు మూడు రోజుల్లో అధికారులు కరీంనగర్ కు తెప్పిస్తున్నారు. వాటిలో పాఠశాల వారీగా ఉపాధ్యాయుల వివరాలను వేలి ముద్రలకు సంబంధించిన వివరాలను పొందుపరచనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో వివిధ కారణాలతో బడికి డుమ్మా కొట్టి ప్రైవేటు కార్యకలాపాలు చేస్తున్న ఉపాధ్యాయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి వీలుంది. ఒకవైపు విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ సరికొత్త సౌకర్యాలను అందిస్తూ ఉంటే కొందరి టీచర్ల వ్యవహారం వల్ల పేద విద్యార్థులకు చదువు సమస్యాత్మకంగానే మారుతోంది.