కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ కి అనుగుణంగానే జాతీయ పార్టీ ఆలోచనను ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తనకు మొదటి నుండి అచ్చొచ్చిన కరీంనగర్ ని జాతీయ పార్టీ మొదటి సభకు వేదికగా మలచాలని భావిస్తున్నట్లు సమాచారం. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తర్వాత జరిగిన భారీ బహిరంగ సభ కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో జరిగింది "సింహ గర్జన" పేరుతో జరిగిన అప్పటి సభకు జనాలు స్వచ్ఛందంగా లక్షలు గా తరలివచ్చారు. అప్పుడప్పుడే ఊపిరి పోసుకుంటున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ చుక్కానిలా మారింది. కేసీఆర్ కి రాజకీయంగా గండం ఏర్పడినప్పుడల్లా అక్కున చేర్చుకున్న కరీంనగర్ జాతీయ పార్టీ విషయంలో కూడా అదేవిధంగా దగ్గరికి తీసుకుంటుంది. అనేది కేసీఆర్ భావన అందుకే జాతీయ పార్టీని హైదరాబాదులో ప్రకటించినప్పటికీ జరపాల్సిన తొలి సభ మాత్రం కరీంనగర్ ని వేదికగా మలుచుకుంటున్నట్లు సమాచారం.
కరీంనగర్ అంటే కేసీఆర్ కి ఎందుకంత సెంటిమెంట్?
నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి వేసిన ప్రతి అడుగులోనూ కీలక మలుపులు కరీంనగర్ కేంద్రంగానే జరిగాయి. 2001లో పార్టీ స్థాపించిన తర్వాత భారీ బహిరంగ సభ ని కరీంనగర్లోనే నిర్వహించారు. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకొని భారీ మెజార్టీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 14వ లోక్ సభలో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా సైతం పనిచేశారు. అప్పటివరకు కాంగ్రెస్ తో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ ఆకస్మికంగా తెలంగాణపై వచ్చిన మాటల యుద్ధం ఉప ఎన్నికల వరకు వెళ్ళింది. మలిదశ కోసం పలువురు సిద్ధాంతకర్తలు మేధావులు కేసీఆర్ ని ప్రోత్సహించడంతో పూర్తిస్థాయిలో ఉపఎన్నికని ఉద్యమానికి అనుకూలంగా మలిచారు.
అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణ రావు కేసీఆర్ మధ్య మాటల యుద్ధం ఒకరకంగా టీఆర్ఎస్ కు మేలు చేసింది. ఆ ఉప ఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పై దాదాపు రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ కి కరీంనగర్ మరోసారి జీవం పోసినట్లయింది. అప్పటివరకు తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పలువురు ఆంధ్ర రాయలసీమ నేతలు సైతం ఈ విజయంతో కొంతవరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బలం పెంచుకున్న కేసీఆర్ తిరిగి ఉద్యమానికి సంబంధించి పలు కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు .అయితే 2008 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నేతను ఎదుర్కొనే క్రమంలో కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి 15 వేల ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు అయినప్పటికీ ఓటమి తప్పడం ఆ ఎన్నికల్లో తెలంగాణ వాదం నిలిచినట్లు చేసింది.
దీక్ష సైతం ఇక్కడే..
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల వల్ల కేసీఆర్ కొద్ది రోజులపాటు మౌనం వహించినా ఆ తర్వాత తిరిగి నిరాహార దీక్షతో తన పోరాటాన్ని మొదలుపెట్టారు. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన ఈ లక్ష్యంగా నిరాహార దీక్ష కోసం సిద్దిపేటలోని దీక్ష స్థలిని ఎంచుకున్నారు. అయితే కరీంనగర్ నుండి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో కరీంనగర్ పట్టణ శివారులోని అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి కేసీఆర్ ను ఖమ్మంకి తరలించారు. దాదాపుగా 24 గంటల పాటు రోడ్డుపైనే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు దీక్షకు దిగడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకొని సంఘీభావం ప్రకటించాయి.
రాష్ట్రంలో మరో తెలంగాణ భవన్ ఇక్కడే
సాధారణంగా సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఆయా స్థానిక నేతల నివాసాల్లో అతిథ్యం స్వీకరిస్తూ ఉంటారు. కానీ కరీంనగర్ లో మాత్రం" ఉత్తర తెలంగాణ భవన్" పేరుతో ప్రత్యేకంగా కేసీఆర్ ఇంటిని నిర్మించుకున్నారు. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇక్కడ విడిది చేయడం కేసీఆర్ కి అలవాటు. ఇలా ఇప్పటివరకు అండదండగా నిలుస్తున్న కరీంనగర్ ని తిరిగి తన జాతీయ పార్టీ ప్రారంభ సభ కోసం వేదికగా మలుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.