"ప్రజావాణి"... జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన కార్యక్రమం. అయితే ఆశయం గొప్పగా ఉన్నా, ఆచరణలో మాత్రం లక్ష్యాలను అందుకోలేకపోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమయానికి కచ్చితంగా ప్రజావాణిని నిర్వహిస్తున్నప్పటికీ, అధికారులు అన్ని సమస్యలు వింటున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇందులో మెజారిటీగా భూములకు సంబంధించి అంశాలు ఉండటం గమనార్హం. కుటుంబ సభ్యుల మధ్య లేదా వారి దగ్గర బంధువుల మధ్యే ఈ భూ సమస్యలు ఉండటం వల్లే సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని చెబుతున్నట్లు తెలుస్తోంది. 


సమస్యలు వింటున్నా పరిష్కారాలు మాత్రం చూపట్లేరు..


కరోనా తర్వాత కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలం తర్వాత అధికారులను ప్రత్యక్షంగా కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం రావడంతో పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి చేరుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే అధిరులు ఫిర్యాదులు అన్నీ బాగానే వింటున్నారు. కానీ ఫిర్యాదులు తీసుకున్న తర్వాత సమస్యలను మాత్రం తీర్చడం లేదు. ఏళ్ల తరబడి దరఖాస్తులకు పరిష్కారం దొరకడం లేదు. పరిష్కారం చేయకుండా అధికారులు నోటీసులు ఇచ్చి పరిష్కరించామని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. 


కరోనా కారణంగా రెండేళ్లుగా వాయిదా..


జగిత్యాల జిల్లాలో ప్రజావాణి దరఖాస్తుల ప్రగతిపై ప్రతి గురువారం కలెక్టర్ సమీక్షిస్తున్నారు. పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని, సరైన శ్రద్ధ వహించాలని ఆదేశిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో దరఖాస్తులు  తీసుకుని రిసిప్ట్ తో సరిపెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల దరఖాస్తులకు మోక్షం లేదు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాకేంద్రానికి రావడంతో ప్రయాణ ఖర్చులు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా మండల కేంద్రంలోని ప్రజావాణి నిర్వహించేవారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. పరిస్థితి సాధారణ స్థితిలోకి వచ్చినప్పటికీ మండల కేంద్రాల్లో అమలు చేయడం లేదు. దీంతో ప్రజలు దూరమైనా కూడా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. మండలాల్లో ప్రజావాణి ఉంటే ప్రయాస తగ్గుతుందని ప్రజలు అంటున్నారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మండల అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాల ఆవిర్భావం తర్వాత అప్పటి పాలనాధికారి అలగు వర్షిణి ప్రజావాణి కోసం ప్రత్యేక సాఫ్టువేర్ రూపొందించారు. ఒక  రూమ్ లో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు బాధితుల దరఖాస్తును స్కానింగ్ చేసి, ఒక సంఖ్యని కేటాయించి ఆన్ లైన్ లో నిక్షిప్తం చేసేవారు. 


నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు..


సంబంధిత బాధితుడు ప్రజావాణి వేదిక వద్దకు వెళ్లగా కలెక్టర్ సంఖ్య ఆధారంగా సమస్యను చూసి అక్కడికక్కడే సంబంధిత అధికారికి పంపించే వారు. జిల్లా స్థాయిలో పారదర్శకత పెరిగింది ఈ విధానం ఆగిపోయింది. ప్రతి దరఖాస్తు పరిష్కరించేందుకు నిర్ణీత గడువు ఉంటే పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల నుంచి మండల స్థాయిలోకి అధికారికి దరఖాస్తు చేరిన వెంటనే కొన్ని చోట్ల మీ అప్లికేషన్ పరిశీలనలో ఉంది అంటూ, నోటీసులతో సరిపెడుతున్నారు. అలా కాకుండా పరిష్కారం ఏ స్థాయిలో ఉందని సమాచారం ఇస్తే బాధితుల్లో కొంత ఊరట కలుగుతుంది. ప్రతి దరఖాస్తు పురోగతి ఆన్ లైన్ లో ఉంటే పరిశీలన చేసేందుకు వీలుగా ఉంటుంది. అంతిమంగా బాధితుడికి న్యాయం చేకూరిస్తేనే కదా ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు అర్థం, పరమార్ధం ఉండేది.