Pak nationals in Hyderabad: హైదరాబాద్: భారత్, పాక్ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ సంబంధిత ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో చేసిన ఉగ్రదాడే అందుకు కారణం. ఈ దాడుల అనంతరం భారత హోం మంత్రిత్వశాఖ పాకిస్తాన్ కు చెందిన పౌరుల అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులుఓ  పాకిస్తాన్ పౌరుడ్ని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 

పాకిస్తాన్ జాతీయుడు హైదరాబాద్కి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. తన  భార్యను, ఆమె కుటుంబాన్ని కలిసేందుకు పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చేందుకు అనుమతి లేకపోవడంతో నేపాల్ మీదుగా మహమ్మద్ ఫయాజ్ హైదరాబాద్కు చేరుకున్నాడు. పాక్ యువకుడు మహమ్మద్ ఫయాజ్ వచ్చాడన్న సమాచారం రావడంతో నగర పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం. 

భారత ప్రభుత్వం పాక్ పౌరులకు అన్ని రకాల వీసాలు రద్దు చేయడంతో పాటు ఈ నెల 27లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ అవసరాలపై వచ్చిన పాక్ జాతీయులు ఈ నెల 29 లోగా దేశం విడిచిపెట్టి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పాక్ పౌరుడు మహమ్మద్ ఫయాజ్ తన భార్య కోసం నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి, చివరికి హైదరాబాద్‌ చేరుకున్నాడు. పక్కా సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు హైదరాబాద్‌లో అధికారికంగా మొత్తం 208 మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.

అధికారిక లెక్కలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్ నగరంలో మొత్తం 208 మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు. వీరిలో 156 మంది దీర్ఘకాలిక వీసాలపై రాగా, 13మంది షార్ట్ వీసాలు అంటే టూరిస్ట్ వీసాల మీద వచ్చారు. మిగిలిన 39 మంది మెడికల్ వీసా (వైద్య సంబంధిత అవసరాల కోసం ఇచ్చే వీసా)లపై హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాదులో ఉన్న అత్యాధునిక  వైద్య సదుపాయాల దృష్ట్యా పాకిస్థాన్ తోపాటు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పలు దేశాల నుంచి ప్రజలు ఇక్కడకు వైద్య సాయం కోసం వస్తుంటారు. ఈనెల 27తో పాక్ పౌరులకు గడువు ముగిసిపోతుంది. వారు ఆ తేదీలోగా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు మెడికల్ వీసాల మీద ఉన్న వారికి మాత్రం మరో రెండు రోజులు అంటే ఈ నెల 29లోగా దేశాన్ని విడిచి పాక్ వెళ్లిపోవాలని గడువు ఇచ్చారు.