World Heart Day 2022: ప్రపంచ హృదయ దినోత్సవ (వరల్డ్ హార్డ్ డే)  సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సైక్లోదాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డెకథ్లాన్, బై సైక్లింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, మ్యాజిక్ 106.4, సేవ్ ది యంగ్ హార్ట్ ఫౌండేషన్ మరియు ఫిటినెస్ 9 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రుల వైద్యులు.. గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. డెకథ్లాన్ కొంపల్లి ఆవరణలో సైక్లోథాన్ ను నిర్వహించారు. ఈ సైక్లోథాన్ లో‌ సుమారు 2000 మంది మెడికల్ విద్యార్థులు, యువకులు ‌పాల్గొన్నారు. సుచిత్రలోని డెకథ్లాన్‌ నుంచి సినీ ప్లానెట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టి.. సైక్లింగ్ వల్లే కలిగే లాభాలను వివరించారు. అనంతరం వేదిక మీద వివిధ రకాల పాటలకు డ్యాన్స్ లు వేస్తూ అలరించారు. యువతలో ఉత్సాహం నింపారు. అనంతరం గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. 


వేదికపై మంత్రి డ్యాన్స్..


ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. వేదికపై సినిమా పాటలకు నృత్యం చేస్తూ... యువతలో ఉత్సాహాన్ని నింపారు. పడుచు పిల్లాడిలా చాలా హుషారుగా మంత్రి డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డ్యాన్స్ అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ... గుండెకు సంబంధించిన వ్యాధుల‌ బారి నుంచి ఎలా బయట పడాలో చక్కగా వివరించిన వైద్యులకు అభినందనలు తెలిపారు. అలాగే సైక్లోథాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.


ఆరోగ్యం కాపాడుకునేందుకు అందరూ వ్యాయామం చేయాలి..


"హార్ట్ ను ఎట్ల కాపాడుకోవాలి, హార్ట్ ను ఎట్ల భద్రంగా పెట్టుకోవాలే, ఎట్ల మెయింటేన్ చేయాలనే దాన్ని చక్కగా వివరించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వైద్యులందరకీ ధన్యవాదాలు. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడకు వచ్చిన వాళ్లంతా డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు ప్రజలందరికీ ఆరోగ్యం గురించి తెలియాలని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయాన్ని అందరూ అర్థం చేస్కోవాలే. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, ఎక్సర్ సైజ్, యోగా, జిమ్ వంటివి ప్రతిరోజు తప్పకుండా చేయాలే. దీని వల్లే ఆరోగ్యం చాలా బాగుంటది". - మల్లారెడ్డి, మంత్రి


మన దేశంలోనే ఎక్కువ మంది చనిపోతున్నారు..


డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ.. "100 మంది కార్డియాక్ పేషెంట్స్ వాకథాన్ కూడా చేస్తున్నరు. రోజు ఎక్సర్ సైజ్ కూడా చేస్తున్నరు. సర్జరీ తర్వాత కూడా వాళ్లు చాలా హెల్దీగా అయ్యారు అనేది దానికి వాళ్లే నిదర్శనం. మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయాలంటే వ్యాయమం వంటివి చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలోనే ఎక్కువ మంది హార్ట్ ఎటాక్ కు గురవుతున్నరు. అందుకు కారణం ఎక్సర్ సైజ్ లు వంటివి చేయాలి" అన్నారు.