Karimnagar Woman Constable Audio Tape Goes Viral: కరీంనగర్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. తన కొడుకుతో కలిసి చనిపోతానని ఆమె ఆ ఆడియో టేపులో ఆవేదన చెందారు. తన స్పౌజ్ (Spouse) ఆప్షన్‌ను పరిష్కరించాలని మహిళా కానిస్టేబుల్ కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, డీజీపీకి వినతి పత్రం రాయడంతో పాటు ఓ ఆడియో టేపును కూడా విడుదల చేశారు. సిరిసిల్ల నుంచి ఇటీవల జగిత్యాలకు ఆమె ఇటీవల బదిలీ అయ్యారు. 7వ బెటాలియన్ సిరిసిల్లలో ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఆమె స్పౌజ్‌కు (Spouse) దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలు అవుతున్నా, ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఆవేదన చెందారు.


తెలంగాణలో 317జీవో (GO 317) వల్ల ఈ భార్యాభర్తలు ఇద్దరి పోస్టింగ్ స్థానాలు మారిపోయాయి. ఆమెకు, రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా నుంచి జగిత్యాలకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. భర్త ఒక దగ్గర భార్య పోస్టింగ్‌ మరోచోట.. దీంతో, వారి మూడేళ్ల చిన్నారిని ఎవరూ చూసుకునేవారు లేకుండా పోయారు. దీంతో తన ఆవేదనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, డీజీపీ మహేందర్ రెడ్డికి తెలిసేలా ఒక ఆడియోను రికార్డు చేసి విడుదల చేశారు ఆ మహిళా పోలీస్. ఇప్పుడిదే కరీంనగర్‌ జిల్లా పోలీసు శాఖలో సంచలనం అయింది. 


“సీఎం సార్‌, డీజీపీ సార్‌ మా ఆవేదనను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నాం. మేం స్పౌజ్ (Spouse) ఆప్షన్‌ పెట్టుకుని నెలలు గడుస్తున్నా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మా మూడేళ్ల పిల్లాడిని ఎవరూ బాబును చూసుకునేవారు లేరు. డ్యూటీకి వచ్చేప్పుడు కూడా వెంటనే తీసుకొని రావాల్సి వస్తోంది. దీంతో, బాలుడు అనారోగ్యం పాలయ్యాడు. పరిస్థితి ఇలాగే ఉంటే.. తమకు, తమ బిడ్డకు చావు తప్ప మరో మార్గం లేదు’’ అంటూ మహిళా కానిస్టేబుల్  (Woman Constable Audio) బోరున విలపించారు. ఆమె విడుదల చేసిన ఆ ఆడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంది.


సామాజిక మాధ్యమాల్లో తన ఆడియో టేపుతో పాటు తమ కుమారుడి ఫోటోను కూడా పెట్టారు. ఈ ఫోటోలో “సీఎం సార్‌.. మా అమ్మా నాన్నల్ని కలపండి..” అని చిన్నారి ఒక ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫోటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంది. మరీ, ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది.