Tiger in Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారం సమీప గ్రామ ప్రజలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఎండలు పెరగడంతో అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవి లోకి వెళ్లే గిరిజనం చిరుత పులులు ఉన్నాయనే సమాచారంతో గజగజా వణుకుతున్నారు. ఈ కాలంలోనే వారు పలు రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి జీవనోపాధి పొందుతారు. గతంలో పలుమార్లు చిరుత సంచారం గురించి తెలిసినప్పటికీ ఈసారి వాటి సంఖ్య మరింత పెరిగిందని తెలియడంతో గిరిజనులు, ఉపాధి కూలీలు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. 


సుమారు 37 వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ప్రధానంగా ఎండాకాలంలోనే ఎక్కువగా ఇక్కడ ఉపాధి కోసం పలు రకాల ఉత్పత్తులను సేకరించి అమ్ముకుంటారు.. చుట్టుపక్కల ప్రజలు. ఈ అడవులు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాలకు చెందిన అడవులతో కలిసి విస్తరించి ఉన్నాయి. దీంతో చిరుతలు స్వేచ్ఛగా సంచరిస్తూ పలుమార్లు ప్రజల కంట పడుతున్నాయి. దాడులకు దిగుతున్నాయి.


ప్రకృతి విధ్వంసమే కారణమా!
సాధారణంగా చిరుతపులి లాంటి వన్య మృగాలు గుట్టలను ఆవాసంగా చేసుకుని బతుకుతాయి. అయితే జిల్లాలో పూర్తిస్థాయిలో గ్రానైట్ పరిశ్రమ విస్తరించి ఉండడంతో బాటు గతంలోకంటే భిన్నంగా మూలమూలలా పరిశ్రమలు వెలసి గుట్టలను గ్రానైట్ కోసం డ్రిల్లింగ్ చేస్తున్నారు. దీంతో చిరుతలతో పాటు ఎలుగుబంట్ల లాంటి జీవులు సమీపంలోని పొలాలపై కానీ, గ్రామాల పై కానీ పడడం జరుగుతోంది. ఆహార కొరత ఉండటం, మరోవైపు సరైన నీటి వసతి కూడా అడవుల్లో  లేకపోవడంతో గ్రామ పొలిమేరల్లో దొరికిన ఆహారాన్ని కానీ నీటిని కానీ గుర్తు పెట్టుకుని మరీ వస్తుంటాయి. ఈ క్రమంలో ముఖ్యంగా ఆవులు, మేకలు లాంటి జంతువులు వీటికి ఆహారంగా మారుతాయి. లేని పరిస్థితుల్లో అవి మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి.


ఎదురైతే ఏం చేయాలి?
చిరుతలు సాధారణంగా చెట్టుపైనే ఉండి రాత్రి పూట ఆహారం కోసం వేటాడతాయి. మామూలుగా పులి లాంటి ఇతర మృగాలతో పోలిస్తే కొంత పిరికితనం కలిగి ఉంటాయి. గుంపులుగా వెళ్తున్న జనాలను చూసినా గాని లేక ఎదురు పడ్డప్పుడు గట్టిగా అరుపులు కేకలతో భయపెట్టినా చిరుత తోకముడుస్తుంది. దాడి చేయదు. అంతేకాకుండా పశువులను మేపడానికి వెళ్లిన వారు, ఇతర పనులపై అడవిలోకి వెళ్లిన వారు వీలైనంత త్వరగానే చీకటి పడే సమయం కంటే ముందే ఇంటికి తిరిగి వచ్చేయడం అన్నిటికన్నా ఉత్తమం అని అటవీ అధికారులు సూచిస్తున్నారు.