భవిత శ్రీ చిట్ ఫండ్ పేరుతో పేపర్లలో భారీ ప్రకటనలు, ప్రధాన నగరాల్లో జాతీయ రహదారుల వెంట ఆకట్టుకునే హోర్డింగ్‌లు, విలాసవంతమైన ఆఫీసులు చూపించారు. దాన్ని చూసిన జనాలు ఎగబడ్డారు. భవిష్యత్తుకు భరోసా ఉంటుందని భవిత శ్రీ చిట్ ఫండ్‌లో చిట్టీలు కట్టారు.
అందరి మాదిరిగానే కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన లింగాల వెంకటేశ్వరావు నగరంలోనీ ఐబి చౌరస్తాలోనీ భవిత శ్రీ చిట్ ఫండ్ కార్యాలయంలో 50లక్షల చిట్టీ కట్టాడు. చిట్టీ గడువు ఇంకా మూడు నెలలు ఉండగా గత సంవత్సరం చిట్టీ ఎత్తుకున్నాడు. చిట్ ఫండ్ నిబంధనల ప్రకారం షూరిటీలు పెట్టించి డబ్బుల కోసం 9 నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదంటు ఆందోళనకు దిగాడు.
ఈ న్యూస్ కాస్తా జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో కార్యాలయానికి వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. చిట్టి కట్టిన వాళ్లంతా డబ్బులు చెల్లించడం లేదంటూ ఆగ్రహంతో ఆఫీసులో బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు చిట్ ఫండ్ సిబ్బందిని, బాధితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇంకా ఎవరైనా ఉంటే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్న పోలీసులు సూచనతో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వచ్చిన వారంతా నేరుగా యాజమాన్యంతోనే వాగ్వాదానికీ దిగారు. గతంలో ఎన్నో సార్లు చిట్ ఫండ్ కార్యాలయాల్లో నిరసనలు తెలిపినా కార్యాలయంలో పెట్రోల్ పోసుకునీ ఆత్మహత్య చేసుకునేందుకు దిగిన దాటవేసే దోరణీ విడనాడటం లేదనీ మండిపడుతున్నారు.
కరీంనగర్ భవితశ్రీ చిట్ ఫండ్ కార్యాలయంలో బాధితులు ఆందోళనకు దిగడం ఇప్పుడు ఆ చిట్ ఫండ్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఖాతాదారులు ఒక్కోక్కరుగా కార్యాలయానికీ బారులుతీరుతున్నారు. కూతురు పెళ్ళి కోసం ఒకరు... ఇల్లు కట్టుకునేందుకు మరొకరు. ఇలా తలో అవసరం కోసం చిట్టీలు వేశారు. కట్టేటప్పుడు అరచేతిలో వైకుంఠం చూపుతున్న చిట్ ఫండ్ కంపెనీ డబ్బులు ఇచ్చేటప్పుడు చుక్కలు చూపిస్తున్నారని మండిపడుతున్నారు.
బాధితులకు చిట్ ఫండ్ యాజమాన్యం గాలం వేస్తోంది.తక్కువ ధరకే ప్లాట్ అంటూ ఆశ చూపుతూ కస్టమర్లను మరో రొంపిలోకి దించి నిండా ముంచుతున్నారు. ఎందుకూ పనికిరాని స్థలాన్ని కస్టమర్లకు అంటగట్టి కోట్లు గడిస్తున్నారు. చిట్ ఫండ్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయొద్దు అంటూ రూల్స్ ఉన్నా దందా సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి కంపెనీల ఆగడాలకు చెక్‌పెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కొందర్ని బెదిరించినట్టు కూడా చిట్ ఫండ్ కస్టమర్లు ఆరోపిస్తున్నారు. తమ పలుకుబడిన ఉపయోగించి ఈజీగా ఈ కేసుల్లోంచి బయటపడతామంటూ చెప్పారని వాపోతున్నారు.