Karimnagar Smart City: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు ఇప్పటివరకూ చకచకా సాగాయి. అయితే అనుకోని సమస్యలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిధుల వినియోగంలో అంచనాలు తప్పడమే కారణమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2017 జూన్ 23వ తేదీన కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా కల్పిస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


2019 ఫిబ్రవరి 25న సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో పూర్తిస్థాయి ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. అయితే మొదట్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు నీరుగారుతోంది అనే అపవాదు వినిపిస్తోంది. కరీంనగర్ చుట్టుపక్కల అనేక అభివృద్ధి పనులు చేశారు కానీ భారీ అంచనాలతో జంబో బడ్జెట్ లను ప్రవేశపెట్టి  వివిధ పనులకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. కానీ చాలా పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏడాదికేడాది బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న పాలకమండలి అంచనాలు తప్పుతున్నాయి. వచ్చిన ఆదాయం అంతా జీతాలు ఇతర ఖర్చులకే సరిపోతోంది. 2022-2023  బడ్జెట్ను ఈ మధ్యే ప్రవేశపెట్టడంతో గత ఏడాది వేసిన అంచనా లోని లోపాలు బయటపడ్డాయి. పబ్లిక్ నుండి అంతో ఇంతో వచ్చే టాక్స్ లు , కిరాయిల ఆదాయం... స్టాఫ్ జీతాలు, కరెంటు బిల్లులు, నిర్వాహణ కే సరిపోతున్నాయి.


కరీంనగర్ కార్పొరేషన్లో 2021-22 కోసం 334 కోట్లతో వాస్తవిక అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 232 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ కింద 100 కోట్లు, స్మార్ట్ సిటీ ఫండ్స్ కు 80 కోట్లు, ఇక కార్పొరేషన్ సొంత ఆదాయంతో పాటు 14 ఫైనాన్స్ పట్టణ ప్రగతి నిధులు కలిపి 52.23 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయి. దీంతో అన్ని అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. 


నిజానికి కరీంనగర్ గతంలో జీవన ప్రమాణాల్లో 22వ స్థానం, నగరపాలక పనితీరులో 21వ స్థానం దక్కించుకుంది. బహిరంగ మల విసర్జన నిర్మూలనలో ప్లస్ ప్లస్ స్థానం సాధించింది. స్వచ్ఛ సర్వేక్షన్ లో  2017లో 259 ర్యాంకు  పొందిన కరీంనగర్ 2020 కి వచ్చేసరికి 72వ ర్యాంకు సాధించింది. ఇక ఈ సంవత్సరం 10 వ ర్యాంకులోపు స్థానం సాధించడానికి సిద్దమవుతున్న తరుణంలో నిధుల విడుదల లో జాప్యం వల్ల అంచనాలు తప్పేలా ఉన్నాయి. ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకొని నగరాన్ని స్మార్ట్ సిటీ సాధించిన తరుణంలో ప్రస్తుత పరిణామాలపై అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.